Atul Kulkarni
-
‘రెచ్చిపోదాం బ్రదర్’మూవీ రివ్యూ
టైటిల్ : రెచ్చిపోదాం బ్రదర్ నటీనటులు :అతుల్ కులకర్ణి,రవికిరణ్, దీపాలి శర్మ,భానుశ్రీ,శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు నిర్మాణ సంస్థలు :ప్రచోదయ ఫిలిమ్స్ నిర్మాత: హనీష్ బాబు ఉయ్యూరు, వివి లక్ష్మీ దర్శకత్వం: ఏ. కె. జంపన్న సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: శ్యాం.కె. నాయుడు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: జులై 29, 2022 కథేంటంటే.. చంద్రమౌళి(బాను చందర్) ఓ జవాన్. బార్డర్లో ఉగ్రవాదుల చేసిన దాడిలో వీరమరణం పొందుతాడు. అతని కొడుకు అభి(రవికిరణ్) చిన్నప్పటి నుంచి జర్నలిస్ట్ కావాలని కోరిక ఉంటుంది. జవాన్ బార్డర్ లో గన్ను పట్టుకుని ఉగ్రవాదులను మట్టుపెడుతూ దేశాన్ని కాపాడితే జర్నలిస్ట్ పెన్ను పట్టుకుని దేశంలో అవినీతి జరగకుండా దేశాన్ని కాపాడుతాడనేది అతని ఉద్దేశం. అనుకున్నట్లే జర్నలిస్ట్ అవుతాడు. అభికి కెమెరామెన్‌గా భానుశ్రీ ఉంటుంది. టీవీ చానల్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే భరణి స్పోర్ట్స్ అకాడమీ పెట్టి ఎందరినో ఛాంపియన్స్ గా తయారు చేస్తున్న నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన భరణి (అతుల్ కులకర్ణి )ని ఇంటర్వ్యూ చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. అభి పనితనం మెచ్చిన ఆ చానల్ సీఈఓ కృష్ణ ప్రసాద్ (కోటేశ్వరరావు ), ఎండీ బాబురావ్ (బెనర్జీ) అతన్ని రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలతకు పంపుతారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి చేసే మోసాలను కవరేజ్ చేసి చానల్ ఇస్తే.. సీఈఓ, ఎండీ వాటిని ప్రసారం చేయకుండా.. మంత్రిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఇది నచ్చక అభి చానల్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ చానల్ పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే వారిని ఇంటర్యూలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఓ సారి తన తోటి జర్నలిస్ట్‌కు చిన్న దెబ్బతగిలితే ఆస్పత్రికి తీసుకెళ్తాడు. అయితే ఆయన అనూహ్యంగా చనిపోయాడని వైద్యులు చెప్తారు. చిన్న దెబ్బకే ఎలా చనిపోతాడని అభి ఎంక్వయిరీ చేయగా.. షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ నమ్మలేని నిజాలు ఏంటి? ఆ మోసం వేనుక ఉన్న గ్యాంగ్ లీడర్ ఎవరు? వ్యవసాయ మంత్రి చేసిన మోసాలు ఏంటి? నిజాయితీ గల జర్నలిస్ట్‌గా అభి వాటిని ఎలా బయటపెట్టాడు? అసలైన జర్నలిస్ట్ గా పని చేస్తే సమాజంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది తెలియాలంటే ‘రెచ్చిపోదాం బ్రదర్’ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నిజాయితీగల జర్నలిస్ట్ అభి పాత్రలో(రవికిరణ్) మంచి నటనను కనబరిచాడు. అతనికి ఇది తొలి సినిమా అయినా.. ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. విలన్ భరణిగా అతుల్ కులకర్ణి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. మంచి ముసుగులో మోసాలకు పాల్పడే పాత్ర తనది. నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేసే వ్యవసాయమంత్రి పాత్రలో అజయ్‌గోష్ మరోసారి తన అనుభవాన్ని తెరపైచూపించాడు.కెమెరామెన్‌గా దీపాలి శర్మ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. తను న్యాచురల్ గా చాలా బాగా నటించింది. రైతుగా శివాజీరాజా చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు . పోలీస్ ఆఫీసర్ గా పోసాని,హీరో కు ఫ్రెండ్ గా శశాంక్, హీరో కు ఫాదర్ గా భానుచందర్, టీవీ చానల్ సీఈఓ, ఎండీగా కోటేశ్వరరావు, బెనర్జీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ఒక దేశానికి ఆర్మీ ఎంత పవర్ఫుల్లో.. మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్ అంటూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఒక నిజాయితీ గల పోలీస్, జర్నలిస్ట్ తలచుకొంటే సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అని చాలా చక్కగా చెప్పారు దర్శకుడు జంపన్న.దీంతో పాటు దేశానికి రైతు ఎంత ముఖ్యమో.. వారు పడే కష్టాలు ఏంటో తెలియజేస్తూ.. సమాజం పట్ల మనకు ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేశాడు. నేటి యువతను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో పాటు డైలాగ్స్ పుష్కళంగా ఉన్నప్పటికీ.. కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ మాత్రం అందరిని ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా రైతులు పడే కష్టాలు, ప్రస్తుతం వారి పరిస్థితులను తెరపై చక్కగా చూపించాడు. ఇక సాంగేకిత విషయానికొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం సాయి కార్తీక్ సంగీతం. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ..కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, సమాకూరుర్చిన ఫైట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. స్టార్ ను నమ్మి కాకుండా కథను నమ్మి ఈ సినిమాకు వస్తే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. -
రెచ్చిపోదాం
కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఏకే జంపన్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్’. వీవీ లక్ష్మి, హనీష్ బాబు ఉయ్యూరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. సాయి కార్తీక్ స్వరాలను అందించారు. మా సినిమా లిరికల్ సాంగ్ ‘జాగో..’ను ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయగా 1 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇందుకు సాయి కార్తీక్ సంగీతం, భాస్కరభట్ల లిరిక్స్, భాను కొరియోగ్రఫీనే కారణం’’ అన్నారు. -
నవ్వులతో రెచ్చిపోదాం
రవికిరణ్.వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్’. ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు నిర్మిస్తున్నారు. జంపన్న మాట్లాడుతూ – ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. మంచి భావోద్వేగాలతో కూడుకున్న వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిస్తున్నాం. సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉంది. సాయి కార్తీక్ సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. ఈ చిత్రంలో పాటలు చాలా ట్రెండీగా, కొత్తగా ఉంటాయి’’ అన్నారు రవికిరణ్. ‘‘ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. యువతను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదంతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు హనీష్ బాబు. దీపాలి శర్మ, శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
అతిథి వస్తున్నారు
కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అధిరన్’. సాయిపల్లవి, ఫాహద్ ఫాజిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో వివేక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ‘అనుకోని అతిథి’ పేరుతో నవంబర్ 15న తెలుగులో రిలీజ్ కానుంది. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సాయిపల్లవి, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి నటన సూపర్బ్. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. మలయాళంలోలానే తెలుగులోనూ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అను మోతే దత్, సంగీతం: పి.ఎస్. జయహరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిన్ శ్రీన్వాస్, సమర్పణ: దీపా సురేందర్ రెడ్డి. -
‘అనుకోని అతిథి’ మూవీ స్టిల్స్
-
అనుకోని అతిథి
ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ముఖ్య తారలుగా వివేక్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అధిరిన్’. ఈ సినిమా ‘అనుకోని అతిథి’ టైటిల్‌తో తెలుగులో విడుదలకానుంది. దీప సురేందర్ రెడ్డి సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘1970లో కేరళలో జరిగిన వాస్తవ సంఘటల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. సాయిపల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాష్‌రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిం చారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్‌ని త్వరలో విడుదల చేసి, సినిమాని కూడా వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు. -
కష్టమంతా మరచిపోయాం
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. వి. అశ్వినికుమార్ దర్శకత్వంలో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్వేతాసింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌మీట్‌లో పీవీఆర్ సినిమా ఉదయ్ మాట్లాడుతూ– ‘‘జెస్సీ’ సినిమాకు ఇంత పెద్ద రేంజ్లో కలెక్షన్స్ వస్తాయని ఊహించలేదు. మల్టీఫ్లెక్స్‌లో ఒక్క షోతో స్టార్ట్ అయి, 7 షోలతో రన్ అవుతుంటే... వన్ షోతో స్టార్ట్ అయిన సింగిల్ స్క్రీన్స్ 4 షోలతో రన్ అవుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో ప్రతి రోజూ కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి’’ అన్నారు. ‘‘ఆడియన్స్ టాక్ విన్న తర్వాత మేం పడ్డ కష్టమంతా మరచిపోయాం. మాపై నమ్మకంతో పీవీఆర్ సినిమాస్ వారు సినిమాను విడుదల చేశారు. వారి నమ్మకం నిజమైంది’’ అన్నారు శ్వేతా సింగ్. ‘‘చిన్నగా విడుదలైన మా సినిమా హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది’’ అని వి. అశ్వినికుమార్ అన్నారు. -
భయపెట్టే జెస్సీ
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. వి.అశ్వినికుమార్ దర్శకత్వంలో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేసి రెండేళ్లు అవుతోంది. అప్పటికీ.. ఇప్పటికీ చాలా మంది మారిపోయారు. ఇది నా మొదటి సినిమాగా విడుదల కావాల్సింది. కొన్ని కారణాలతో ఆలస్యం కావడంతో రెండో సినిమాగా విడుదవుతోంది. ఈ చిత్రంలో మెయిన్‌లీడ్‌గా మంచి క్యారెక్టర్ చేశాను’’ అన్నారు. ‘‘హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పి.వి.ఆర్ సినిమాస్ ద్వారా మా సినిమా విడుదలవుతోంది’’ అన్నారు శ్వేతా సింగ్. ‘‘ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అశ్వినికుమార్. ‘‘ఈ సినిమాకు సంగీతం అందించడాన్ని ఎంజాయ్ చేశాను’’ అని మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల అన్నారు. ‘‘మంచి చిత్రం చేశాం. ఇందులో హారర్ కంటే ఇద్దరు సిస్టర్స్ మధ్య మంచి సెంటిమెంట్ మెప్పిస్తుంది’’ అన్నారు నటుడు విమల్ కృష్ణ. అభినవ్ గోమటం పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్.ఎన్. -
దసరాకు ఫిబ్రవరి ఘటన
అతుల్ కులకర్ణి, మనోజ్ మిశ్రా, తనికెళ్ల భరణి, యశ్పాల్ శర్మ, షిజ్జు, సంజు శివరామ్ ముఖ్య తారలుగా రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెలుగు, ఒడిస్సాలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘పట్నఘడ్’. ‘23 ఫిబ్రవరి 2018, ఒడిస్సా’ అనేది ట్యాగ్‌లైన్. రేంజ్ రాయల్ సినీ ల్యాబ్స్‌పై శ్రీధర్ మార్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘ఒడిస్సాలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా అతుల్ కులకర్ణి నటిస్తున్నారు’’ అన్నారు రాజేష్. ‘‘ప్రోస్థటిక్ మేకప్ డిజైనర్‌గా ఎన్.జి. రోషన్ వర్క్ చేస్తున్నారు. హిందీ చిత్రం ‘102 నాటౌట్’ ఫేమ్ జార్జి జోసెఫ్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమా కోసం ఫోక్ సాంగ్‌ను కంపోజ్ చేయడం విశేషం’’ అన్నారు నిర్మాత శ్రీధర్ మార్తా. -
తొమ్మిది చుట్టూ...
అశ్వనీ కుమార్ దర్శకత్వంలో శ్వేతాసింగ్ నిర్మిస్తున్న చిత్రం ‘9’. అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చన శాస్త్రి, పావనీ గంగిరెడ్డి, ఆషిమా నర్వాల్, శ్రిత చందన ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘నాకు రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అందులో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్లో వస్తున్న తొలి చిత్రం ‘9’. సినిమాను 32 రోజుల్లో తెరకెక్కిద్దామనుకున్నాం. అయితే 27రోజుల్లోనే కంప్లీట్ చేయగలిగాం’’ అన్నారు. నలుగురు ఘోస్ట్ హంటర్స్ ఓ హంటెడ్ హౌస్‌లో దెయ్యాలున్నాయా..? లేవా అని సెర్చ్ చేయడానికి వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే చిత్రకథ. సినిమాలో అనేక అంశాలు 9 చుట్టూ తిరుగుతుంటాయి’’ అన్నారు అశ్వనీ కుమార్. -
ఘాజీ వంటి సినిమాలు రావాలి
‘‘యువతలో స్ఫూర్తి నింపే చిత్రం ఇది. దేశంలో ఐకమత్యాన్ని పెంచి, శాంతిపథంలో పయనించేలా చేయ డంలో ‘ఘాజీ’ వంటి చిత్రాలు దోహదపడతాయి. ఇలాంటి చిత్రాలు రావాలి’’ అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, కేకే మీనన్ ముఖ్య తారలుగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ‘ఘాజీ’ని ఆదివారం వెంకయ్య నాయుడు చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘హింస, చౌకబారు విషయాలు లేకుండా సంకల్ప్ రెడ్డి చిత్రాన్ని బాగా తీశారు. కమర్షియల్ హంగులు, రంగులు లేక పోయినా.. మెండుగా దేశభక్తిని కలిగించే చిత్రమిది. రానా చక్కటి నటన ప్రదర్శించారు. ఈ సాహసో పేతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ఇలాంటి దేశభక్తి చిత్రాలకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం సముచితమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న విషయాన్ని ఆయన ముందుంచితే.. ‘‘వినోదపు పన్ను అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోకి వస్తుంది. పీవీపీ ఓ భారతీయ పౌరుడిగా బాధ్యతతో సినిమా తీశా రు. ఢిల్లీలో కేంద్ర మంత్రులకు ‘ఘాజీ’ హిందీ వెర్షన్ చూపించడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. చిత్రనిర్మాత పీవీపీ పాల్గొన్నారు. -
చాందినీ బార్.. మధుర్
మధుర్ భండార్కర్ దర్శకత్వంలో టబు, అతుల్ కుల్కర్ణి నటించిన ‘చాందినీ బార్’ చిత్రానికి పదమూడేళ్లు పూర్తయ్యాయి. తనకు జాతీయ అవార్డు సాధించిన పెట్టిన ఈ చిత్రం తన లైఫ్‌నే మార్చేసిందని మధుర్ భండార్కర్ చెబుతున్నాడు. ఇది తనకొక మరపురాని అనుభూతి అని ‘ట్విట్టర్’లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘చాందినీబార్’ సక్సెస్ తర్వాత ‘ఫ్యాషన్’, ‘పేజ్ 2’, ‘కార్పొరేట్’ వంటి విలక్షణ చిత్రాలు రూపొందించిన భండార్కర్, ప్రస్తుతం ‘క్యాలెండర్ గర్ల్స్’ను తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. -
సినిమా రివ్యూ: వీరుడొక్కడే
తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరం' చిత్రం 'వీరుడొక్కడే'గా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అన్యాయం, చెడు, ఫ్యాక్షన్‌ను ఎదిరించి...మంచి కోసం ఎంతవరకైనా తెగించే మనస్తత్వం కల వ్యక్తి వీరేంద్ర(అజిత్). తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నలుగురు సోదరుల కోసం వీరేంద్ర పెళ్లికి దూరంగా ఉంటాడు. అన్యాయం, అక్రమాలను పాల్పడే వీరభద్రం (ప్రదీప్ రావత్) దుశ్చర్యల నుంచి ప్రజల్ని కాపాడుతుంటాడు. ఈ క్రమంలో తన సహచరులతో ఆ గ్రామంలోకి ప్రవేశించిన గోమతి దేవి (తమన్నా) అనే అర్కిటెక్ట్.. వీరేంద్ర ప్రేమలో పడేలా నలుగురు సోదరులు ప్లాన్ చేస్తారు. వీరేంద్ర మంచితనాన్ని చూసి గోమతి ప్రేమలో పడుతుంది. గోమతి ప్రేమ కోసం ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని వీరేంద్ర నిర్ణయం తీసుకుంటాడు. తమ గ్రామంలో నాగరాజు (అతుల్ కులకర్ణి) గ్రూప్‌తో జరిగిన సంఘటన ప్రభావంతో హింస, గొడవలు, కొట్లాట, ఫ్యాక్షన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని గోమతి కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది. వీరేంద్రను పెళ్లి చేసుకుందామనుకునుకున్న తరుణంలో గోమతిపై నాగరాజు గ్రూప్ ఎటాక్ చేస్తుంది. నాగరాజు గ్రూపును వీరేంద్ర ఎదుర్కొని.. గోమతిని ఆ దాడి నుంచి రక్షిస్తాడు.. అయితే ఆ సంఘటనలో వీరేంద్ర అసలు రూపాన్ని గోమతి చూస్తుంది. తనకు ఇష్టం లేని వ్యవహారాలే వీరేంద్ర జీవితంలో ప్రధానమైనవని తెలుసుకున్న గోమతి షాక్ అవుతుంది. వీరేంద్ర అసలు జీవితం తెలుసుకున్న తర్వాత గోమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గోమతిపై ఎటాక్ ఎందుకు జరిగింది. నాగరాజు అసలు గోమతి కుటుంబంపై ఎందుకు పగ పెంచుకుంటాడు? నాగరాజు, వీరభద్రం గ్రూప్‌ల ఆటకట్టించి.. గోమతిని, తన కుటుంబాన్ని వీరేంద్ర ఎలా రక్షించుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ’వీరుడొక్కడు’. మాస్, యాక్షన్ ఎలిమెంట్ పుష్కలంగా ఉన్న వీరేంద్ర పాత్రలో అజిత్ కనిపించారు. ప్రేమ కోసం హింస, ఫ్యాక్షన్ కు స్వస్తి చెప్పిన వ్యక్తిగా, ప్రేయసి కోసం, ప్రేమను పంచిన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్లే మరో షేడ్ ఉన్న క్యారెక్టర్‌ను అజిత్ అవలీలగా పోషించాడు. అయితే గతంలో చాలా చిత్రాల్లోఇలాంటి పాత్రల్లో కనిపించిన అజిత్.. మరోసారి రొటీన్‌గానే అనిపించాడు. అర్కిటెక్ట్‌గా గోమతి పాత్రలో ఓ సంప్రదాయ యువతిగా తమన్నా కనిపించింది. ఈ చిత్రంలో గోమతి పాత్ర ప్రధానమైనప్పటికి... సహజంగా ప్రేక్షకులు ఆశించే గ్లామర్ మిస్ కావడం నిరాశ కలిగించే అంశం. గోమతి పాత్ర కారెక్టరైజేషన్ పర్ ఫెక్ట్‌గా లేకపోవడం కొంత మైనస్. అంతేకాకుండా గోమతి పాత్ర కృత్రిమంగా కనిపిస్తుంది. విలన్లు ప్రదీప్ రావత్, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినా.. చిత్రంలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపేలా విలనిజం లేకపోవడం ప్రధాన లోపమని చెప్పవచ్చు. తమన్నా తండ్రిగా నాజర్ పర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో బాగా నచ్చే అంశం లాయర్ పాత్రలో సంతానం పండించిన కామెడీ. సంతానం కామెడి ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గొప్పగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వెట్రీ ఫోటోగ్రఫి చిత్రానికి అదనపు ఆకర్షణ. యాక్షన్ సీన్ల చిత్రీకరణ రిచ్‌గా ఉంది. భూపతి రాజా, శివ అందించిన కథలో కొత్తదనం లేకపోయింది. సంతానంపై చిత్రీకరించిన కామెడీ సీన్లలో డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తమిళంలో ‘వీరం’ పేరుతో విడుదలై.. ఘన విజయాన్ని సాధించిన వీరుడొక్కడే చిత్రం తెలుగు ప్రేక్షకులకు రొటీన్ చిత్రమనే చెప్పవచ్చు. పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.