టైటిల్ : రెచ్చిపోదాం బ్రదర్
నటీనటులు :అతుల్ కులకర్ణి,రవికిరణ్, దీపాలి శర్మ,భానుశ్రీ,శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు
నిర్మాణ సంస్థలు :ప్రచోదయ ఫిలిమ్స్
నిర్మాత: హనీష్ బాబు ఉయ్యూరు, వివి లక్ష్మీ
దర్శకత్వం: ఏ. కె. జంపన్న
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: శ్యాం.కె. నాయుడు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేది: జులై 29, 2022
కథేంటంటే..
చంద్రమౌళి(బాను చందర్) ఓ జవాన్. బార్డర్‌లో ఉగ్రవాదుల చేసిన దాడిలో వీరమరణం పొందుతాడు. అతని కొడుకు అభి(రవికిరణ్) చిన్నప్పటి నుంచి జర్నలిస్ట్ కావాలని కోరిక ఉంటుంది. జవాన్ బార్డర్ లో గన్ను పట్టుకుని ఉగ్రవాదులను మట్టుపెడుతూ దేశాన్ని కాపాడితే జర్నలిస్ట్ పెన్ను పట్టుకుని దేశంలో అవినీతి జరగకుండా దేశాన్ని కాపాడుతాడనేది అతని ఉద్దేశం. అనుకున్నట్లే జర్నలిస్ట్ అవుతాడు. అభికి కెమెరామెన్‌గా భానుశ్రీ ఉంటుంది. టీవీ చానల్‌లో జాయిన్ అయిన కొద్ది రోజులకే భరణి స్పోర్ట్స్ అకాడమీ పెట్టి ఎందరినో ఛాంపియన్స్ గా తయారు చేస్తున్న నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన భరణి (అతుల్ కులకర్ణి )ని ఇంటర్వ్యూ చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు.
అభి పనితనం మెచ్చిన ఆ చానల్ సీఈఓ కృష్ణ ప్రసాద్ (కోటేశ్వరరావు ), ఎండీ బాబురావ్ (బెనర్జీ) అతన్ని రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలతకు పంపుతారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి చేసే మోసాలను కవరేజ్ చేసి చానల్ ఇస్తే.. సీఈఓ, ఎండీ వాటిని ప్రసారం చేయకుండా.. మంత్రిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఇది నచ్చక అభి చానల్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ చానల్ పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే వారిని ఇంటర్యూలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఓ సారి తన తోటి జర్నలిస్ట్‌కు చిన్న దెబ్బతగిలితే ఆస్పత్రికి తీసుకెళ్తాడు. అయితే ఆయన అనూహ్యంగా చనిపోయాడని వైద్యులు చెప్తారు. చిన్న దెబ్బకే ఎలా చనిపోతాడని అభి ఎంక్వయిరీ చేయగా.. షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ నమ్మలేని నిజాలు ఏంటి? ఆ మోసం వేనుక ఉన్న గ్యాంగ్ లీడర్ ఎవరు? వ్యవసాయ మంత్రి చేసిన మోసాలు ఏంటి? నిజాయితీ గల జర్నలిస్ట్‌గా అభి వాటిని ఎలా బయటపెట్టాడు? అసలైన జర్నలిస్ట్ గా పని చేస్తే సమాజంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది తెలియాలంటే ‘రెచ్చిపోదాం బ్రదర్’ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
నిజాయితీగల జర్నలిస్ట్ అభి పాత్రలో(రవికిరణ్) మంచి నటనను కనబరిచాడు. అతనికి ఇది తొలి సినిమా అయినా.. ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. విలన్ భరణిగా అతుల్ కులకర్ణి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. మంచి ముసుగులో మోసాలకు పాల్పడే పాత్ర తనది. నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేసే వ్యవసాయమంత్రి పాత్రలో అజయ్‌గోష్ మరోసారి తన అనుభవాన్ని తెరపైచూపించాడు.కెమెరామెన్‌గా దీపాలి శర్మ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. తను న్యాచురల్ గా చాలా బాగా నటించింది. రైతుగా శివాజీరాజా చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు . పోలీస్ ఆఫీసర్ గా పోసాని,హీరో కు ఫ్రెండ్ గా శశాంక్, హీరో కు ఫాదర్ గా భానుచందర్, టీవీ చానల్ సీఈఓ, ఎండీగా కోటేశ్వరరావు, బెనర్జీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర నటించారు.
ఎలా ఉందంటే..
ఒక దేశానికి ఆర్మీ ఎంత పవర్‌ఫుల్లో.. మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్ అంటూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఒక నిజాయితీ గల పోలీస్, జర్నలిస్ట్ తలచుకొంటే సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అని చాలా చక్కగా చెప్పారు దర్శకుడు జంపన్న.దీంతో పాటు దేశానికి రైతు ఎంత ముఖ్యమో.. వారు పడే కష్టాలు ఏంటో తెలియజేస్తూ.. సమాజం పట్ల మనకు ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేశాడు.
నేటి యువతను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో పాటు డైలాగ్స్ పుష్కళంగా ఉన్నప్పటికీ.. కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ మాత్రం అందరిని ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా రైతులు పడే కష్టాలు, ప్రస్తుతం వారి పరిస్థితులను తెరపై చక్కగా చూపించాడు.
ఇక సాంగేకిత విషయానికొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం సాయి కార్తీక్ సంగీతం. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ..కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, సమాకూరుర్చిన ఫైట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. స్టార్ ను నమ్మి కాకుండా కథను నమ్మి ఈ సినిమాకు వస్తే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది.
Comments
Please login to add a commentAdd a comment