'ఘాజీ' మూవీ రివ్యూ | Ghazi Movie Review | Sakshi
Sakshi News home page

'ఘాజీ' మూవీ రివ్యూ

Published Fri, Feb 17 2017 9:54 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Ghazi Movie Review

టైటిల్ : ఘాజీ
జానర్ : సబ్ మెరైన్ వార్ డ్రామా
తారాగణం : రానా, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ
సంగీతం : కె. కృష్ణ కుమార్
దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి
నిర్మాత : అన్వేష్ రెడ్డి, వెంకట్రమణా రెడ్డి, ప్రసాద్ వి పొట్లూరి



భారతీయ సినిమాల్లో వార్ డ్రామాలు చాలా తక్కువ. ముఖ్యంగా స్వతంత్ర పోరాట నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కినా.. పూర్తి స్థాయి వార్ డ్రామాగా సినిమాలు రాలేదు. ఆ లోటును తీరుస్తూ.. చరిత్ర కథల్లో పెద్దగా ప్రాచుర్యం పొందని ఓ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు ఘాజీ టీం. 1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ..



కథ :
1971... పాకిస్థాన్, బంగ్లాదేశ్లు ఒకే దేశంగా తూర్పు, పశ్చిమ పాకిస్థాన్లు గా ఉన్న రోజులు. పశ్చిమ పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం తూర్పు పాక్లో గొడవలు జరుగుతున్న రోజులు. ఆ సమయంలో వేలాదిగా శరణార్థులు తూర్పు పాకిస్థాన్ నుంచి భారత దేశ సరిహద్దుకు చేరుకుంటుండటంతో వారికి భారత్ సహాయం చేస్తుందని పాకిస్థాన్ ఆర్మీ భావిస్తుంది.

తూర్పు పాకిస్థాన్లో పరిస్థితులను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి భారత్ మీద పగ తీర్చుకోవడానికి పాక్ ఆర్మీ పథకం వేస్తుంది. భారత నావీ అమ్ములపోదిలోని బ్రహ్మాస్త్రం ఐఎన్ఎస్ విక్రాంత్ను ఎటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అది సాధ్యం కాని సమయంలో భారత్ లోని ఏదైన ఓడరేవు మీద ఎటాక్ చేసి భారత నావీ దృష్టి మళ్లించాలని నిర్ణయించుకుంటుంది.

పాక్ నావీ పన్నాగాలను ముందే పసిగట్టిన భారత నావికాదళ అధికారులు, భారత సముద్ర జలాల్లో గస్తీ కోసం ఎస్ 21 సబ్ మెరైన్ పంపాలని భావిస్తుంది. ఎస్ 21 కమాండెంట్ రణ్విజయ్ సింగ్ (కేకే మీనన్). శత్రువు దగ్గర్లో ఉన్నాడని తెలిస్తే చాలు అతనే వెళ్లి ఎటాక్ చేస్తాడు. ఇంత ఆవేశపరుడు కెప్టెన్గా ఉంటే అనవసరంగా యుద్ధం కొని తెచ్చుకోవటమే అని భావించిన నావల్ అధికారులు రణ్విజయ్ సింగ్కు తోడుగా లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ( రానా)ను పంపిస్తారు.

ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్ పిఎన్ఎస్ ఘాజీ సబ్ మెరైన్ను కమాండెంట్ రజాక్ సారధ్యంలో భారత జలాల్లోకి పంపిస్తుంది. పిఎన్ఎస్ ఘాజీ అత్యంత శక్తివంతమైన సబ్ మెరైన్, భారత జలాంతర్గాముల కన్నా ఎన్నో రెట్లు వేగంగా శక్తివంతంగా పనిచేసే సబ్ మెరైన్. ఇంత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనటానికి రణ్ విజయ్ సింగ్ , అర్జున్ వర్మలు ఏం చేశారు. చివరకు ఎవరు గెలిచారు అన్నదే ఘాజీ కథ.

విశ్లేషణ :

చరిత్ర పుస్తకాల్లో పెద్దగా కనిపించని, వినిపించని మన విజయగాథను సినిమాటిక్ గా చూపించే ప్రయత్నం చేసిన ఘాజీ టీం ఘన విజయం సాధించారు. సినిమా అంతా ఒక్క సబ్ మెరైన్లో సాగే కథతో ఇంత భారీ చిత్రాన్ని తెరకెక్కించటం అంటే సాహసమే. అయితే కథా కథనాల మీద దర్శకరచయిత సంకల్ప్ రెడ్డికి ఉన్న పట్టు.. ఎక్కడా పట్టు సడలకుండా సినిమాను నడిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్న కారణంతో అనవసరంగా పాటలు, కామెడీ సీన్స్ ఇరికించకపోవటం కూడా సినిమా స్థాయిని మరింత పెంచింది.

అదే సమయంలో సంకల్ప్ రెడ్డి ఈ కథకోసం ఎంత రిసెర్చ్ చేశాడో తెర మీద స్పష్టంగా కనిపించింది. సంఘటన నేపథ్యంతో పాటు అప్పటి పరిస్థితులు, పరిసరాలు, సబ్ మెరైన్ లోపలి వాతవరణం.. నావల్ ఆఫీసర్లు వాడే భాష లాంటి విషయాల్లో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాయి. ఆర్ట్, ఎడిటింగ్, రీ రికార్డింగ్లు దర్శకుడి ఆలోచన మరింత గొప్పగా తెరమీదకు వచ్చేందుకు హెల్ప్ అయ్యాయి.

ప్రతీ నటుడు నిజంగా దేశం కోసం యుద్ధం చేస్తున్నామన్నంత ఆవేశంగా తెర మీద కనిపించారు. ముఖ్యంగా కేకే మీనన్ పాత్ర సినిమాకు మెయిన్ ఎసెట్. ఆవేశం, ఆలోచన ఉన్న కెప్టెన్గా ఆయన నటన ఆకట్టుకుంటుంది. లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ పాత్రలో రానా నటన అద్భుతం. అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే సిన్సియర్ అధికారిగా అదే సమయంలో దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడని యోధుడిగా కనిపించిన రానా సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేశాడు. ఇతర పాత్రల్లో అతుల్ కులకర్ణి, తాప్సీ, నాజర్, ఓం పురిలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

ఘాజీ ప్రతీ భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన భారత నావికాదళ విజయ గాథ. ప్రతిఒక్కరు తప్పక చూడాల్సిన చిత్రం

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement