ఒక్క సినిమాకు ఐదు క్లైమాక్స్లు
యంగ్ హీరో రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రానాతో పాటు అతుల్ కులకర్ణి, కె కె మీనన్, తాప్సీలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు సముద్ర జలాల్లో జరిగిన యుద్ధకథతో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం కూడా ఘాజీనే కావటం విశేషం.
కొత్త దర్శకుడు సంకల్ప రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా క్లైమాక్స్పై ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధ సమయంలో పాకిస్థాన్కు చెందిన ఘాజీ అనే సబ్ మెరైన్ అదృష్యమైంది. ఈ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు ఐదు రకాల క్లైమాక్స్లు రాశాడట.
యూనిట్ సభ్యులతో పాటు కొంత మంది బాలీవుడ్ రచయితలను కూడా సంప్రదించి వాటిలో బెస్ట్ క్లైమాక్స్ను ఫైనల్ చేసి తెరకెక్కించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 17న రిలీజ్ కానుంది.