'శత్రువుల ప్రాణాలు తీయడం దేశభక్తి'
హైదరాబాద్: 'దేశభక్తి అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చేయడం కాదు.. శత్రువుల ప్రాణాలు తీయడం' అంటూ ఘాజీ చిత్రంలోని డైలాగ్ రోమాలు నిక్కపొడిచేలా ఉంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానా, తాప్సీ ప్రధాన నాయక నాయికలుగా నటించిన ఘాజీ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూస్తున్నంత సేపు దేశభక్తి నరాల్లో పొంగడంతోపాటు ఏ క్షణం ఏం జరగనుందా అనే ఉత్కంఠ రేపేలా ఈ ట్రైలర్ ఉంది. 1971లో విశాఖపట్నంలోని భారత ప్రముఖ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేసే లక్ష్యంతో పాకిస్థాన్‌కు చెందిన జలాంతర్గామి పీఎన్‌ఎస్ ఘాజీ భారత జలాల్లోకి ప్రవేశిస్తుంది.
ఈ జలాంతర్గామి ద్వారా జరిగే దాడిని అడ్డుకునేందుకు భారత జలాంతర్గామి ఎస్-21 తీవ్రంగా ప్రయత్నించి పాక్ జలాంతర్గామిని ధ్వంసం చేసి సముద్రంలో ముంచివేస్తుంది. ఇదంతా ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ నేపథ్యాన్ని కథగా తీసుకొని ఘాజీ పేరుతో హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో దగ్గుపాటి రానా భారత నావికా దళంలో పనిచేసే సైనికుడిగా ఉంటాడు. ఘాజీని ధ్వంసం చేసే ఆపరేషన్‌లో పాల్గొన్న భారత జలాంతర్గామిలోని ఆఫీసర్లలోని ఓ కీలక ఆఫీసర్ పాత్రలో రానా కనిపిస్తాడు.