రానా...హూ ఈజ్‌ రాణి? | daggubati rana special interview on he's persinol life | Sakshi
Sakshi News home page

రానా...హూ ఈజ్‌ రాణి?

Published Sun, Dec 18 2016 1:19 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానా...హూ ఈజ్‌ రాణి? - Sakshi

రానా...హూ ఈజ్‌ రాణి?

ఇంత ఫిజిక్‌ ఉన్నోడికి కెమిస్ట్రీ ఉండదా!
ఉండకుండా ఎలా ఉంటుంది?
మనం బయాలజీలో చదివాం కదా.
బయాలజీతో బాడీ అర్థమైంది.
బాటనీతో లవ్‌ అర్థం చేసుకుందాం.
తీగ అల్లుకోవడానికి పొడవాటి కర్ర కావాలి.
ఈ సిక్స్‌ఫీట్‌ ప్లస్‌ ప్లస్‌ ప్లస్‌ కుర్రాడికి
ఎన్ని తీగలు అల్లుకొని ఉంటాయి?
నిజమే. అన్నీ అల్లికలే!!
జస్ట్‌ రూమర్స్‌ అంటున్నాడు రానా.
ఫ్రెండ్స్‌ రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లకు
ఆల్రెడీ రాణులు దొరికేశారు.
వాట్‌ అబౌట్‌ యూ.. రానా?
హూ ఈజ్‌ రాణి?∙∙l

 
ఏంటి రానా.. ఓ 20, 30 కిలోలు తగ్గినట్లున్నారు?
(నవ్వుతూ). అవును. మామూలుగా నా వెయిట్‌ అటూ ఇటూగా 90 కిలోలు ఉంటుంది. ‘బాహుబలి’ సినిమా కోసం అదనంగా 30 కిలోలు పెరిగాను. షూటింగ్‌ అయిపోయింది కదా.. బరువు కూడా తగ్గించేశా.

‘బాహుబలి’, ‘ఘాజీ’... ఇలా పెద్ద సినిమాలు చేస్తున్నారు.. కానీ, స్టార్‌డమ్‌ ఎందుకు మిస్‌ అవుతోంది?
స్టార్‌డమ్‌ వెనక నేనెప్పుడూ వెళ్లలేదు. కొత్త సినిమాలు చేయాలన్నది నా టార్గెట్‌. అలాంటప్పుడు స్టార్‌డమ్‌ గురించి ఆలోచించకూడదు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేయాలంటే ఇప్పటికిప్పుడు నా దగ్గర పది కథలున్నాయి. కానీ, నా దారి వెరీ స్పెషల్‌. ఈ దారిలో వెళ్లే నటులు లేరు. ‘బాహుబలి’, ‘ఘాజీ’ వంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. ‘ఘాజీ’ తీయడం పెద్ద రిస్క్‌. కొత్త సినిమా చూపించాలనే తపనతో నిర్మాత ముందుకొచ్చినప్పుడు నటుడిగా నేను సపోర్ట్‌ చేయాలి. అందుకే పారితోషికం గురించి మాట్లాడలేదు. ఆ మాటకొస్తే నేను చేసే ప్రతి సినిమాకీ రిలీజైన తర్వాత లాభాలొస్తే వాటా తీసుకుంటాను.

అంటే పారితోషికం గురించి అస్సలు మాట్లాడుకోరా?
మాట్లాడను. కొత్త తరహా సినిమాలు తీయడం రిస్క్‌. నిర్మాత ఆ రిస్క్‌ తీసుకోవడానికి రెడీ అయినప్పుడు ఆర్టిస్ట్‌గా నేను ముందుకు రావాలి. అలా రెడీ అయ్యాను కాబట్టే, ‘రానాకు ఎంత నమ్మకం ఉంటే... డబ్బులు తీసుకోకుండా ఐదు నెలలుS డేట్స్‌ ఇచ్చాడు’ అని ‘ఘాజీ’ నిర్మాతలు ముందుకొచ్చారు. నాలాంటి ఆర్టిస్టులు నిర్మాతకు ఆ భరోసా ఇవ్వకపోతే కొత్త సినిమాలు రావు.

పర్సనల్‌ విషయాలకొస్తే...  మీ అమ్మగారికి ఎలాంటి కోడల్ని ఇవ్వాలనుకుంటున్నారు?
మా ఇంట్లో పెద్దగా ఏం కోరుకోరు. మాది జాయింట్‌ ఫ్యామిలీ. పిల్లలు పెరిగే కొద్దీ ఇల్లు చిన్నది కావడంతో బాబాయ్‌ (వెంకటేశ్‌) కొత్త ఇల్లు కట్టుకున్నారు. నేను ఎప్పటికీ అమ్మానాన్నతోనే ఉంటాను. మాది ఉమ్మడి కుటుంబం అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ ఎవరి ప్రైవసీ వాళ్లకు ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మాతోనే జీవించాలి. అయితే మా ఇంట్లో రూల్‌ బుక్‌ ఏం లేదు. అత్త– మామల ముందు కూర్చోకూడదు వంటి నియమాలు ఉండవు. మా ఇంట్లో అడుగుపెట్టే కోడలు హ్యాపీగా ఉండొచ్చు.

మీ బావ చైతూ (నాగచైతన్య)కి త్వరలో పెళ్లవుతోంది. మిమ్మల్ని ఇంట్లో తొందర పెట్టడం లేదా?
ఆ మధ్య నా సిస్టర్‌ బర్త్‌డే పార్టీలో ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ అందరూ ‘చూడు... నీకన్నా చిన్నోడు. పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌’ అన్నారు. ‘వాడికి కుదిరింది బాస్‌. నాకు కుదరలేదు. వాడి పెళ్లి కుదిరిందని హ్యాపీగా ఫీలవ్వండి. నేను హ్యపీగా ఉన్నాను, నన్నెందుకు ఇబ్బంది పెడతారు’ అన్నాను.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో దేవుడికెరుక. మీ నెక్ట్స్‌ గాళ్‌ ఫ్రెండ్‌ ఎవరు అనేది కూడా దాదాపు అలాంటిదే?
భలేవారే. నా అంతట నేను ఎవరి పేరూ చెప్పలేదు. ఎవరికి వాళ్లు ఎవరెవరి పేరో ఊహించుకుని రాశారు. విశేషం ఏంటంటే.. అలుపూ సొలుపూ లేకుండా రాస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కొంచెం జోరు తగ్గింది. రాసేవాళ్లకూ బోర్‌ కొట్టేసినట్టుంది. ‘వీడి గురించి ఎన్నిసార్లు రాస్తాం’ అని కొంచెం డోస్‌ తగ్గించారు (నవ్వుతూ).

మీరూ, త్రిష జంటగా ఓ పెళ్లికి వెళ్లారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారట. తర్వాత బ్రేకప్‌ అయ్యారనే వార్త వినిపిస్తోంది?
ఆ సంగతి పక్కన పెట్టి, నా గురించి ఓ విషయం చెబుతా. నాతో జీవితం పంచుకోవాలనుకున్నప్పుడు నేను కొన్ని అంశాలు కావాలనుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లు కొన్ని కోరుకుంటారు. అందులో నాకు తగ్గట్టుగా కొన్ని ఉండకపోవచ్చు. నా లైఫ్‌ సై్టల్‌ అసాధారణంగా ఉంటుంది. హిందీ సినిమా చేస్తే ఆరు నెలలు ముంబైలో ఉంటాను. ఒక్కోసారి హైదరాబాద్‌ రావడం చాలా రోజులు అవుతుంది. వచ్చే ఏడాది టీవీ షోస్‌ గురించి డిస్కస్‌ చేయడానికి అమెరికా వెళ్తున్నా. మూడు నెలలు అక్కడే ఉంటాను. డిస్కషన్స్‌ పూర్తి కాకపోతే ఏడాది అక్కడే ఉండొచ్చు. ఒకవేళ నాకు పెళ్లైతే అవన్నీ చేసే వీలు ఉండదు. కొన్నాళ్లు ఇక్కడ? కొన్నాళ్లు ఎక్కడో అంటే లైఫ్‌ పార్టనర్‌ ఒప్పుకోవాలి కదా! పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు... కానీ, ముందు లైఫ్‌ను ఓ స్ట్రక్చర్‌లోకి తెచ్చుకున్నాక పెళ్లి చేసుకుంటా.


మీ క్లాస్‌మేట్స్‌ కమ్‌ సెలబ్రిటీ ఫ్రెండ్స్‌ పెళ్లి చేసుకున్నప్పుడు ‘మీ పెళ్లి ఎప్పుడ’నే ప్రశ్న ఎదురవుతుంది కదా?
ఈ డిస్కషన్‌ అంతా హైదరాబాద్‌లోనే. ముంబై వెళితే అస్సలు రాదు. అక్కడ నాకంటే వయసులో పెద్దవాళ్లు పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉంటున్నారు. సమస్య ఏంటంటే.. నేను ఏ కల్చర్‌లోనూ పూర్తిగా లేను. మద్రాస్‌ నుంచి ఇక్కడికి వచ్చిన కొత్తలో నన్ను ‘మదరాసీ’ అనేవాళ్లు. అక్కడేమో తెలుగబ్బాయి అంటారు. ముంబై వెళితే సౌత్‌ అబ్బాయి అంటారు. మొన్న నా అమెరికా ఫ్రెండ్స్‌ హైదరాబాద్‌ వచ్చారు. నేను ఓ పెళ్లికి వెళ్తుంటే వివరాలు అడిగారు. పెద్దలు కుదిర్చిన పెళ్లని చెప్పగానే షాకయ్యారు. ‘అమ్మాయి, అబ్బాయి ఎప్పుడూ కలుసుకోలేదా? ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటున్నారా?’ అన్నారు. ‘మేం ఇలాంటి కాన్సెప్ట్‌ వినడం ఇదే ఫస్ట్‌ టైమ్‌’ అని, షాకయ్యారు.

ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?
ఫస్ట్‌ టైమ్‌ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చరణ్‌ (రామ్‌ చరణ్‌), అల్లు అర్జున్‌లకు పెళ్లి అయినప్పుడు వచ్చింది. మనకూ ఓ అమ్మాయి దొరికితే బాగుంటుందనుకున్నా. ప్చ్‌.. దొరకలేదు. అంతకుముందు ఎప్పుడు పడితే అప్పుడు చరణ్, అర్జున్‌కి ఫోన్‌ చేసేవాణ్ణి. పెళ్లయ్యాక ‘ఏమో.. వైఫ్‌తో ఎక్కడికైనా వెళ్లారేమో.. ఫోన్‌ చేయొచ్చో లేదో’ అనుకోవడం మొదలుపెట్టా. అప్పుడు స్మార్ట్‌గా ఆలోచించా (నవ్వుతూ). పెళ్లైనోళ్లతో వర్కౌట్‌ కావడం లేదని నాకన్నా వయసులో చిన్నోళ్లతో ఫ్రెండ్‌షిప్‌ చేయడం మొదలు పెట్టాను. పెళ్లైనోళ్లు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్లే ఫోన్‌ చేసి నన్ను పిలుస్తారు కదా.

త్రిష గురించి అడుగుతుంటే.. పెళ్లి మీద మీ ఒపీనియన్‌ చెబుతున్నారు! అసలు త్రిషను ప్రేమించారా? లేదా?
త్రిషతో రిలేషన్‌షిప్‌లో ఉండుంటే మాట్లాడేవాణ్ణి. ప్రతి ఒక్కరికీ వాళ్లకంటూ ఓ జీవితం ఉంటుంది. త్రిష నాకు మంచి స్నేహితురాలు. తనంటే గౌరవం.

త్రిషతో లవ్, బ్రేకప్‌ అనే వార్త తర్వాత శ్రియ పేరు వచ్చింది. తనతో మీ రిలేషన్‌షిప్‌ ఏంటి?
శ్రియ తెలుగులో హీరోయిన్‌గా చేసిన 5వ సినిమా ‘నీకు నేను నాకు నువ్వు’కి నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశా. అప్పట్నుంచీ తను నాకు ఫ్రెండ్‌. అప్పట్లో మేం ఫ్రెండ్లీగా ఉంటే ఎవరూ ఏమీ మాట్లాడేవాళ్లు కాదు. నేను హీరో అయిన తర్వాత తను నాతో కనిపిస్తే అందరూ వింతగా చూస్తున్నారు. నా పర్సనల్‌ ఫ్రెండ్స్‌ గ్రూప్‌లో శ్రియ కూడా ఉంది. మొన్న ముంబై వెళ్లినప్పుడు ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళుతూ.. మధ్యలో శ్రియను కలిశా. అక్కడ మేం మొత్తం 14 మంది ఉన్నాం. కానీ, మా ఇద్దరిని మాత్రమే ఫొటో తీసి, దాన్నో న్యూస్‌ కింద క్రియేట్‌ చేశారు. ఎలా రియాక్ట్‌ కావాలో అర్థం కాలేదు.

లైఫ్‌ని ఓ స్ట్రక్చర్‌లోకి తెచ్చుకునేవరకూ పెళ్లి చేసుకోనంటున్నారు... ఈలోపు పెళ్లి వయసు దాటిపోతుంది కదా?
ఈ రోజుల్లో వయసనేది పెద్ద విషయం కాదు. నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌లో ఒకరికి 50 ఏళ్లు.. ఇంకొకరికి 22 ఏళ్లు. ఆ రెండు ఏజ్‌ గ్రూప్‌లవాళ్లతోనూ బాగుంటాను. నాకు 46 ఏళ్ల ఫ్రెండ్‌ ఉన్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. నాకంటే వయసులో చిన్నోళ్లైన స్నేహితులు పెళ్లి చేసుకున్నారు. కొందరు పెళ్లైన తర్వాత విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. (నవ్వులు). ఈ రోజుల్లో ఈ వయసులోనే పెళ్లి చేసుకోవాలనే రూల్‌ లేదు.


ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా?
నాకు ఏదైనా సమస్య లేదు. పక్క రూమ్‌లో ఓ పెద్దాయన (తండ్రి సురేశ్‌బాబు) ఉన్నారు. ఆయన్నే అడగండి.

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి మీరే ఇల్లు కొనిచ్చారట?
(పెద్దగా నవ్వుతూ..) నేను తనకు ఇల్లు కొనిపెట్టానా? నా గురించి వచ్చిన పరమ చెత్త రూమర్లలో ఇదొకటి. ఇలాంటి డర్టీ రూమర్స్‌ విన్నప్పుడు కోపంగా ఉంటుంది. నా గురించి ఎంత చెత్త రాసినా నేను పట్టించుకోను. ఇతరులను ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం, పుకార్లు సృష్టించడం మంచిది కాదు. వాళ్లూ ఫీలవుతారు.

మరి.. ‘ఇలాంటి రూమర్స్‌ మానుకోండి’ అంటూ ఎప్పుడూ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వరెందుకని?
బురదలో రాయి వేస్తే ఏమవుతుంది? మన మీద పడుతుంది. పది రోజుల క్రితం జోరుగా షికారు చేసిన ఓ వార్త ఇప్పుడు చప్పగా అనిపిస్తుంది. ఎవరూ పట్టించుకోరు. నా గురించి ఏదైనా వార్త వచ్చినప్పుడు చదివిన ఆ నిమిషం, ఆ తర్వాత ఓ గంట, ఆ వారం ఇరిటేట్‌ అయ్యి ఆ తర్వాత ఎవడి పాపాన వాడు పోతాడని వదిలేస్తా. నాకు ఫైట్‌ చేసే ఓపిక లేదు. ఫైట్‌ చేయాలంటే హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు.. ప్రతి ఊళ్లోనూ చేయాలి. అక్కడ కూడా నా గురించి న్యూస్‌లు వస్తుంటాయి కదా.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో హిందీ హీరోయిన్‌ బిపాసా బసుతో ఎఫైర్‌ అంటూ ఓ వార్త వచ్చింది. అప్పుడు ఏమనిపించింది?
నా ఫస్ట్‌ సినిమా ‘లీడర్‌’, ఆ తర్వాత హిందీలో చేసిన ‘దమ్‌ మారో దమ్‌’ టైమ్‌లో బిపాసా బసుతో వచ్చిన పుకార్లు నాపై ప్రభావం చూపాయి. అప్పుడు బయటకు వెళ్లడం మానేశా. తర్వాత ‘మన జీవితాన్ని ఎవరి కోసమో ఎందుకు మార్చుకోవాలి. మనం మార్చుకోకూడదు బాస్‌’ అని డిసైడ్‌ అయ్యా. అలా ఫిక్స్‌ అయిన తర్వాత, నటుడు కాకముందు ఎలా ఉండేవాణ్ణో అలాగే ఉండటం మొదలుపెట్టా. హ్యాపీగా నా కారు నేనే డ్రైవ్‌ చేస్తా. ఒంటరిగా నచ్చిన రెస్టారెంట్‌కి వెళ్లి, ఫుడ్‌ లాగిస్తా. ఫ్రెండ్స్‌తో స్పెండ్‌ చేయాలంటే హ్యాపీగా వెళ్తా. నాకు నచ్చినట్లుగా ఉంటున్నాను.

ఈ రూమర్స్‌ విని మీ అమ్మగారు ఏమంటారు?
మా అమ్మను చూస్తే మీకు తెలుస్తుంది. అస్సలు టెన్షన్‌ పడదు. నాకంటే రిలాక్స్‌›్డగా, కూల్‌గా ఉంటుంది. చిన్నప్పట్నుంచీ మాకు అమ్మ చాలా ఫ్రీడమ్‌ ఇచ్చింది. నా ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను ఏ విషయాన్నీ దాచను. నేనేం చేస్తున్నాను? ఎక్కడ ఉన్నాను?.. ఇలా అన్నీ వాళ్లకు తెలుసు. అందుకే  ఎవరేమన్నా మా అమ్మ సమాధానం చెబుతుంది. మనకు ఎవరు ముఖ్యం అనుకుంటామో.. వాళ్లకు మన గురించి నిజాలు తెలియాలి. మిగతా ప్రపంచంతో మనకు సంబంధం లేదు. ఎవరో ఏదో పార్టీలో నా గురించి మాట్లాడితే నాకేంటి?

మీరు ఫ్రీ బర్డ్‌లా ఉంటారనిపిస్తోంది..
యస్‌. ‘ఏం చేస్తే ఎవరేం అనుకుంటారో!’ అని ఆలోచిస్తే హ్యాపీగా ఉండలేం. ‘ఇతరులు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఏం అనుకుంటున్నారనేది వాళ్ల సమస్య. నీ సమస్య కాదు’ – స్కూల్‌ లైఫ్‌ నుంచి నేను ఫాలో అవుతున్న ప్రిన్సిపల్‌ ఇది. నా ఆనందాన్ని ఇతరుల ఆలోచనల్లో వెతుక్కోవాలనుకోవడం లేదు. అసలు ఈ సొసైటీతోనే సమస్యంతా. వాళ్లు ఏమనుకుంటారో, వీళ్లు ఏమనుకుంటారో అంటుంటారు. కులం, మతం ఏదీ పట్టించుకోకూడదు. అందరితో ఫ్రెండ్లీగా ఉండడం... హ్యాపీగా ఉండటం. అంతే. మనకు నచ్చినట్లుగా ఉంటే లైఫ్‌ హ్యాపీగా ఉంటుంది. – డి.జి. భవాని

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement