త్రిభాషా చిత్రంలో...
ఇది రానాకి సవాల్‌లాంటి సీజన్ అనాలి. ఎందుకంటే ఒకే సారి మూడు ద్విభాషా చిత్రాల్లో నటిస్తున్నారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజ్’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఘాజి’ తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. త్వరలో ఆరంభం కానున్న ‘1945’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇప్పుడు ఏకంగా ఓ త్రిభాషా చిత్రంలో నటించడానికి అంగీకరించారు. మేజర్ రవి దర్శకత్వంలో మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.
మేజర్ మహదేవన్ అనే పాత్ర చుట్టూ తిరిగే ‘కీర్తిచక్ర’, ‘కురుక్షేత్ర’, ‘కాందహార్’ వంటి వార్ మూవీస్ తీసిన మేజర్ రవి ఇప్పుడు ఇదే పాత్రతో తాజా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గత మూడు చిత్రాల్లోనూ మేజర్ మహదేవన్‌గా మోహన్‌లాల్ నటించారు. నాలుగో చిత్రంలోనూ ఈ పాత్రను ఆయనే చేయనున్నారు. మరో కీలక పాత్రకు రానాను తీసుకున్నారు. ఇందులో రానా లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్రలో కనిపిస్తారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల మొదలవుతుంది.