సముద్రం.. యుద్ధం...
ఇండియా- పాకిస్తాన్ మధ్య యుద్ధాలు కాశ్మీర్ లోయలోనూ, సరిహద్దుల్లోనూ మాత్రమే జరగలేదు. ఓ యుద్ధం నీటిలో... అదీ మన విశాఖ సముద్ర తీరంలో జరిగింది. 1971లో జరిగిన యుద్ధంలో పీఎన్‌ఎస్ ఘాజీ అనే పాకిస్తాన్ జలాంతర్గామి సముద్రంలో మునిగింది. చరిత్రలోని ఈ యుద్ధ గాథ కూడా ఎక్కడో అడుగున పడింది. పెద్దగా ఎవరికీ తెలీదు. ఇప్పుడీ కథను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నూతన దర్శకుడు సంకల్ప్. రానా, తాప్సీ జంటగా సంకల్ప్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, అన్వేష్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘ఘాజీ’.
ఆది వారం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘హాలీవుడ్ స్థాయిలో తీసిన చిత్రమిది. నీటి అడుగున చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు, యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. వచ్చే ఫిబ్రవరి 17న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. భారతీయ తొలి జలాంతర్గామి చిత్రం ఇది’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హిందీలో విడుదల చేస్తున్నారు.