దుమ్ము రేపుతున్న ఘాజీ
దేశభక్తిని నరనరాల్లో ఉప్పొంగించేలా చేసిన సినిమా.. ఘాజీ. ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మూడు భాషల్లో వెండితెరను తాకనున్న విషయం తెలిసిందే. ఈలోపు విడుదలైన సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఆ ట్రైలర్‌ను దాదాపు 2 కోట్ల మందికి పైగా చూసినట్లు చిత్ర బృందం తెలిపింది. భారతీయ సినిమాల్లో మొట్టమొదటిసారిగా సముద్రంలో యుద్ధ సన్నివేశాలను ఒళ్లు గగుర్పొడిచేలా చిత్రీకరించిన ఈ సినిమా.. 1971 నాటి భారత్-పాక్ యుద్ధం ఆధారంగా తీసిన సంగతి తెలిసిందే.
భారతదేశానికి చెందిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేసేందుకు పాకిస్థాన్ నుంచి ఘాజీ అనే జలాంతర్గామి వస్తుంది. దాన్ని ఎస్21 అనే భారత జలాంతర్గామిలో ఉన్న నౌకాదళం సిబ్బంది విజయవంతంగా ధ్వంసం చేస్తారు. ఈ సమయంలో భారత నౌకాదళ సిబ్బంది చూపిన ధైర్యసాహసాలు, ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం తదితర సన్నివేశాలను చిత్రీకరించారు. విశాఖపట్నం తీరంలో.. ఘటన జరిగినచోటే తీసిన ఈ సినిమాకు తూర్పు నౌకాదళానికి చెందిన సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందించారు. రానా, తాప్సీ జంటగా నటించిన ఈ సినిమాలో కేకే మీనన్, ఓంపురి, అతుల్ కులకర్ణి తదితర దిగ్గజ నటులు ఉన్నారు. ఓంపురి నటించిన సినిమాల్లో చివరగా విడుదలవుతున్నది ఇదే కావడం మరో విశేషం.