
ఒక్కసారి తప్పటడుగేస్తే...!
‘‘ఎన్ని పాత్రలు చేసినా చేయడానికి ఇంకా చాలా మిగిలిపోయి ఉంటాయి. అందుకే వందల సినిమాలు చేసినా కళాకారుల దాహం తీరదు’’ అని తాప్సీ అన్నారు. ఈ ఢిల్లీ బ్యూటీ గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ చిత్రాల్లో కనిపిస్తారు. ఇప్పటికే మూడు చిత్రాలు కమిట్ అయ్యారామె. వాటి గురించి తాప్సీ చెబుతూ - ‘‘ప్రస్తుతం అంగీకరించిన చిత్రాల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘ఘాజి’ షూటింగ్ ఇటీవలే మొదలైంది. నా కెరీర్‌కి ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఇది కాకుండా సంతకం చేసిన మరో రెండు సినిమాలు కూడా నటిగా నాకు ఇంకా మంచి పేరు తెచ్చే విధంగానే ఉంటాయి.
మంచి పాత్రల కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నాను. అందుకే, కొన్ని రోజులు ఖాళీగా కూడా ఉన్నాను. నా నిరీక్షణ వృథా కాలేదు. మంచి అవకాశాలు దక్కాయి. హిందీ పరిశ్రమలో అవకాశాలు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, మంచి కథలు ఎంపిక చేసుకోవడం మాత్రం కష్టమే. ఒక్క సెలక్షన్ రాంగ్ అయితే చాలు... ఇక రెండోది సెలక్ట్ చేసుకునే అవకాశమే ఉండదు. అందుకే, ప్రతి అడుగూ పదిలంగా వేయాలి. ఆ... ఏముందిలే అని ఎలా పడితే అలా సినిమాలు చేసేస్తే, నిలదొక్కు కోవడం కష్టం. అందుకే సిని మాల సెలక్షన్ విషయంలో కాస్త ఓపికగా వ్యవహరించాలి’’ అని వివరించారు.