వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.
ప్రతీకారం
పవర్‌ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్‌ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్‌ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.
ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
శివశక్తి
దాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్‌లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.
మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.
కూతురి కోసం...
ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
వంట గదిలో తుపాకీ
కిచెన్‌లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్‌లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.
అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్‌డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.
హ్యాండ్ బాగ్‌లో బాంబు
ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్‌ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.
గాంధారి గతం
కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.
ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. :
ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment