పాకిస్థాన్ నటులతో... రానా ఘాజీ | Rana Daggubati begins shooting for 'Ghazi' | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ నటులతో... రానా ఘాజీ

Published Tue, Apr 12 2016 10:32 PM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM

పాకిస్థాన్ నటులతో... రానా ఘాజీ - Sakshi

పాకిస్థాన్ నటులతో... రానా ఘాజీ

హీరో రానా ఇప్పుడు ఒకటికి రెండు విధాల సంతోషంగా ఉన్నారు.
‘బాహుబలి’లో చేసిన భల్లాలదేవుడి పాత్ర గురించి, ‘బాహుబలి-2’ షూటింగ్ గురించి ఆయన ఎలాగూ ఆనందంగా ఉన్నారు.
మరి, రెండో కారణం ఏమిటంటారా?
అది - నౌకాదళంపై భారతదేశంలో తయారవుతున్న తొలి సినిమా ‘ఘాజీ’!
ఆ చిత్రంలో రానా పోషిస్తున్న పాత్ర!

 

విశాఖ తీరం... ఇండో - పాక్ యుద్ధ నేపథ్యం...
1971లో జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి ‘పి.ఎన్.ఎస్. ఘాజీ’ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగా ముంచి వేశారు. ఆ ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని చేస్తున్న సినిమా ‘ఘాజీ’. ఈ చిత్రంలో కోస్ట్ గార్డ్స్‌లో ఎస్-21 అనే నౌకాదళ అధికారి పాత్రను రానా పోషిస్తున్నారు. ‘‘ఇది ఒక అద్భుతమైన వాస్తవ కథ. విశాఖపట్నంలో కొంతకాలం ఉన్న నాకు ఈ సబ్‌మెరైన్ కథ తెలుసు.

ఇంతవరకూ ఎవరూ దీనిపై సినిమా తీయకపోవడం, ఇప్పుడు నాకు అందులో పాత్ర చేసే అవకాశం రావడం అదృష్టం’’ అని రానా అన్నారు. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తాను స్వయంగా రాసుకున్న ‘బ్లూ ఫిష్’ అనే నవలను ఆధారంగా చేసుకొని, స్క్రిప్ట్ అల్లుకొని, ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పి.వి.పి. సినిమా’ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తోంది. అలాగే, తమిళంలోనూ అనువదించి, విడుదల చేయనున్నారు. కథానాయిక తాప్సీ, ప్రముఖ హిందీ సినీ నటుడు కేకే మీనన్‌లు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
 
వాస్తవికత కోసం... అక్కడి నటులతో...

పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో సహజంగానే పాకిస్తానీ పాత్రలుంటాయి. ఆ పాత్రలకు ఇక్కడి నటులకు వేషం వేసి పెట్టకుండా, దర్శక - నిర్మాతలు వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన రంగస్థల నటులు 11 మందిని ప్రత్యేకంగా ఈ పాత్రలకు ఎంపిక చేశారు. ఏకంగా వారందరినీ ఇండియాకు రప్పించి, వారితోనే ఆ పాత్రల్ని పోషింపజేసినట్లు చిత్ర నిర్మాణ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జలాంతర్గామి సెట్స్ అన్నీ వేసి మరీ చిత్రీకరణ జరిపారు. హైదరాబాద్‌లో పెద్ద జలాశయంలో రెండు జలాంతర్గాముల్ని సృష్టించారు.
 
భారత యుద్ధ నౌక ‘ఐ.ఎన్.ఎస్. విక్రాంత్’లో అప్పట్లో పనిచేసిన నౌకాదళ అధికారుల్ని కూడా రానా స్వయంగా కలిశారు. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ కోసం కొంతమంది నౌకాదళ అధికారుల్ని కూడా మేము కలిశాం. మా నాన్న గారు (ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు) తన పరిచయాలతో వారిని కలవడానికి సాయపడ్డారు. కానీ, అప్పటి యుద్ధ సంఘటనల వివరాలన్నీ ‘రహస్య సమాచారం’తో కూడిన ఫైల్ కావడం వల్ల అధికారులు పెద్దగా వివరాలు బయటపెట్టలేకపోయారు. ఇది యథార్థ గాథ అయినప్పటికీ, సినీ మాధ్యమానికి తగ్గట్లు కొంత స్వేచ్ఛ తీసుకొని సన్నివేశ కల్పన చేశాం. ఏమైనా, మా మటుకు నాకు ఇది అందరికీ చెప్పాల్సిన అద్భుతమైన కథ’’ అని రానా పేర్కొన్నారు.
 
ఉదయం నుంచి రాత్రి దాకా... నీటిలోనే!    
భారీ నిర్మాణ విలువలతో జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ రెండు, మూడు రోజుల షూటింగ్ మినహా మిగతా అంతా పూర్తయిపోయింది. కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి ‘అండర్ వాటర్’ పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు. కొద్ది రోజులు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు నీటిలోనే ఉండి, షూటింగ్ చేస్తూ బాగా శ్రమపడ్డారని చిత్ర యూనిట్ సమాచారం. గ్రాఫిక్ వర్క్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్న సినిమా ఇది. అందుకే, శ్రద్ధగా చేయాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు తగినంత టైమ్ కేటాయించాలని దర్శక, నిర్మాతల భావన. అవన్నీ పూర్తి చేసుకొని, ఈ ఏడాది దసరాకు ‘ఘాజీ’ని రిలీజ్ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement