hero rana
-
ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు..
‘బాహుబలి’ చిత్రంలో బాగా బరువు పెరిగి కండలు తిరిగిన ‘భల్లాలదేవ’గా కనిపించారు రానా. ప్రస్తుతం నటించిన ‘అరణ్య’ కోసం ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు. ఇలా పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతారు. ఇక ‘అరణ్య’ సినిమా విషయానికి వస్తే.. ఇందులో బందేవ్ అనే పాత్రలో కనిపిస్తారు రానా. అస్సాంలోని ఖాజిరంగా దగ్గరలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు ఆక్రమించారు. అలా కబ్జా చేసిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, జంతువులను కాపాడే లక్ష్యంతో ఉండే బందేవ్ అనే వ్యక్తి నిజజీవిత పాత్రలో నటించారు రానా. విశేషం ఏంటంటే.. ఈ సినిమా కోసం 30 కిలోలు తగ్గడమే కాదు.. సినిమా మొత్తం తన ఎడమ భుజాన్ని (లెఫ్ట్ షోల్డర్) పైకి లేపి నటించారు రానా. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’గా, తమిళ్లో ‘కాడన్’గా హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘‘ఎప్పుడూ భారీకాయంతో ధృడంగా ఉండాలనుకునే నాకు ఈ స్థాయిలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన పని. ఈ సినిమా కోసం నేను తీసుకున్న ఫిజికల్ ట్రైనింగ్ నాకొక వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు రానా. -
అది నిజం కాదు బ్రదర్
ఓ నెటిజన్ వ్యంగ్య వ్యాఖ్యకు హీరో రానా అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అసలేం జరిగిందంటే... ‘‘నేను పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. అయినా ఆ ఫలితం నా కలలను నేరవేర్చుకునే ప్రక్రియను నిరుత్సాహపరచలేదు’’ అని రానా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ హెడ్‌లైన్‌ను ట్వీటర్లో పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. ‘ఎందుకంటే మా కుటుంబానికి ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఉంది’ (రానాను ఉద్దేశిస్తూ) అంటూ వ్యంగ్య ధోరణిలో ఓ కామెంట్‌ని ఆ పోస్ట్‌కు జోడించాడు నెటిజన్. ఈ కామెంట్‌కు హీరో రానా తనదైన శైలిలో బదులు చెప్పారు. ‘‘నువ్వు చెప్పింది నిజం కాదు బ్రదర్. నువ్వు నటన అనే కళను నేర్చుకోకపోతే నిర్మాణ సంస్థ ఉన్నా ఏ ఉపయోగం ఉండదు. మంచి కథలను ప్రేక్షకుల మందుకు తీసుకువెళ్లడానికి చాలా నిర్మాణ సంస్థలు పని చేస్తున్నాయి’’ అంటూ, ‘నువ్వు ఒక ఫెయిల్యూర్వి అని ప్రపంచం అంతా అంటున్నా నీ కలలను వెంటాడు’ అని కూడా సూచించారు రానా. ఏప్రిల్ 2న అరణ్య: రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన త్రిభాషా చిత్రం ‘అరణ్య’. తమిళంలో ‘కాడన్’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్స్‌ను పెట్టారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం. -
జీవితంలో గుర్తుండి పోతుంది- హీరోయిన్
‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమా యూనిట్ సభ్యులు బుధవారం నగరంలో సందడి చేశారు. బెంజ్ సర్కిల్లోని ట్రెండ్ సెట్ మాల్‌కు హీరో దగ్గుపాటి రాణా, హీరోయిన్ కాజల్ ఆగర్వాల్, నిర్మాతలు కిరణ్ రెడ్డి, భతర్ చౌదరి విచ్చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రాణా మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలిసారిగా నటించినట్లు తెలిపారు. ఈ సినిమా పక్కా మాస్ సినిమా అని, కుటుంబసమేతంగా చూడదగిన కథాంశంతో తీసినట్లు చెప్పారు. ఈ సినిమాను డైరెక్టర్ తేజ చాలా చక్కగా తీశారని పేర్కొన్నారు. రాజకీయ నేపథ్యం.. భార్యభర్తల బంధమే ముఖ్యఅంశమన్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. జీవితంలో గుర్తుండిపోతుంది: కాజల్ అగర్వాల్ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమా జీవితంలో గుర్తిండిపోయేలా విజయాన్ని సాధిస్తుందని హీరోయిన్ కాజల్ అగర్వాల్ అన్నారు. ఈ సినిమాలో ఎంతో కష్టపడి నటించామని, షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. కాజల్, రాణాలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ట్రెండ్‌సెట్ మాల్‌కు తరలివచ్చారు.-లబ్బీపేట (విజయవాడ తూర్పు) కేల్ యూనివర్శిటీలో సందడే సందడి వడ్డేశ్వరం: వడ్డేశ్వరంలోని కేల్ యూనివర్శటీలో బుధవారం సినీనటులు సందడి చేశారు. నేనే రాజు-నేనే మంత్రి చిత్ర ప్రచారంలో భాగంగా హీరో రాణా, హీరోయిన్ కాజల్ అగర్వాల్, చిత్ర యూనిట్ సభ్యులు వర్శిటీకి విచ్చేశారు. వారితో కరచాలనం కోసం విద్యార్థులు పోటీపడ్డారు. రాణా విద్యార్థులందరికీ అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. వర్శిటీ విద్యార్థి విభాగం డీన్ హబీబుల్లా ఖాన్, హ్యాపీ క్లబ్ విభాగం ఇన్చార్జి శుభాకరరాజు పాల్గొన్నారు. నేనే రాజు.. నేనే మంత్రి.. పక్కా మాస్ సినిమా. కుటుంబసమేతంగా చూడొచ్చు. రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ భార్యాభర్తల అనుబంధమే ముఖ్యాంశం. ఇది అందరికీ నచ్చుతుంది. – రానా, కాజల్ -
చాబాలలో ‘రానా’ సందడి
వజ్రకరూరు : మండలంలోని చాబాల పరిసర ప్రాంతంలో గురువారం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్ సందడి చేసింది. సినిమా షూటింగ్ జరుగుతుందనే సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రంలో రానాతో పాటు హీరోయిన్ కాజల్, మరో నటుడు నవదీప్ కూడా నటిస్తున్నారు. -
ఉరవకొండలో రానా సందడి
ఉరవకొండ : సురేష్ ప్రొడెక్షన్స్ పతాకంపై తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను మంగళవారం ఉరవకొండ ఎస్కె ప్రభుత్వ క్రీడా మైదానంలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రానా నటిస్తున్నారు. అనంతపురం జిల్లా రాజకీయ నేపథ్యంలో పలు సన్నివేషాలను చిత్రీకరించారు. చిత్రంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా జోగేంద్ర (రానా) ఎన్నికల ప్రచార సభను షూట్ చేశారు. ఇక... ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్న కాజోల్కు సంబంధించిన సన్నివేశాలను మండల పరిధిలోని ఆమిద్యాల, రాకెట్ల, కొట్టాలపల్లిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. -
రేపు ఉరవకొండకు హీరో రానా
ఉరవకొండ : ఉరవకొండలో మరోసారి షూటింగ్ సందండి ప్రారంభం కానుంది. బహుబలి ఫేం దగ్గుపాటి రానాతో పాటు ప్రముఖ నటీనటులంతా సందడి చేయనున్నారు. సురేష్ ప్రొడెక్షన్స్ పతాకం పై రానా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఉరవకొండలో చిత్రీకరించనున్నారు. 3న ఉరవకొండ ఎస్కె ప్రభుత్వ క్రీడా మైదానంలో పతాక సన్నివేశాలు షూట్ చేస్తారు. ఆర్ట్ డైరెక్టర్ సుబ్బారాయుడు పర్యవేక్షణలో ఆదివారం సినిమాలో ఓ భారీ బహిరంగ సభకు సంభందించిన సెట్ ను సిద్ధం చేస్తున్నారు. గతంలో ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో నాని, మోహరూన్ హీరో హీరోయిన్లుగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం దాదాపు 60 శాతానికి పైగా ఉరవకొండలోనే షూటింగ్ జరిగింది. -
పాకిస్థాన్ నటులతో... రానా ఘాజీ
హీరో రానా ఇప్పుడు ఒకటికి రెండు విధాల సంతోషంగా ఉన్నారు. ‘బాహుబలి’లో చేసిన భల్లాలదేవుడి పాత్ర గురించి, ‘బాహుబలి-2’ షూటింగ్ గురించి ఆయన ఎలాగూ ఆనందంగా ఉన్నారు. మరి, రెండో కారణం ఏమిటంటారా? అది - నౌకాదళంపై భారతదేశంలో తయారవుతున్న తొలి సినిమా ‘ఘాజీ’! ఆ చిత్రంలో రానా పోషిస్తున్న పాత్ర! విశాఖ తీరం... ఇండో - పాక్ యుద్ధ నేపథ్యం... 1971లో జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి ‘పి.ఎన్.ఎస్. ఘాజీ’ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగా ముంచి వేశారు. ఆ ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని చేస్తున్న సినిమా ‘ఘాజీ’. ఈ చిత్రంలో కోస్ట్ గార్డ్స్‌లో ఎస్-21 అనే నౌకాదళ అధికారి పాత్రను రానా పోషిస్తున్నారు. ‘‘ఇది ఒక అద్భుతమైన వాస్తవ కథ. విశాఖపట్నంలో కొంతకాలం ఉన్న నాకు ఈ సబ్‌మెరైన్ కథ తెలుసు. ఇంతవరకూ ఎవరూ దీనిపై సినిమా తీయకపోవడం, ఇప్పుడు నాకు అందులో పాత్ర చేసే అవకాశం రావడం అదృష్టం’’ అని రానా అన్నారు. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తాను స్వయంగా రాసుకున్న ‘బ్లూ ఫిష్’ అనే నవలను ఆధారంగా చేసుకొని, స్క్రిప్ట్ అల్లుకొని, ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పి.వి.పి. సినిమా’ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తోంది. అలాగే, తమిళంలోనూ అనువదించి, విడుదల చేయనున్నారు. కథానాయిక తాప్సీ, ప్రముఖ హిందీ సినీ నటుడు కేకే మీనన్‌లు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వాస్తవికత కోసం... అక్కడి నటులతో... పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో సహజంగానే పాకిస్తానీ పాత్రలుంటాయి. ఆ పాత్రలకు ఇక్కడి నటులకు వేషం వేసి పెట్టకుండా, దర్శక - నిర్మాతలు వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన రంగస్థల నటులు 11 మందిని ప్రత్యేకంగా ఈ పాత్రలకు ఎంపిక చేశారు. ఏకంగా వారందరినీ ఇండియాకు రప్పించి, వారితోనే ఆ పాత్రల్ని పోషింపజేసినట్లు చిత్ర నిర్మాణ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జలాంతర్గామి సెట్స్ అన్నీ వేసి మరీ చిత్రీకరణ జరిపారు. హైదరాబాద్‌లో పెద్ద జలాశయంలో రెండు జలాంతర్గాముల్ని సృష్టించారు. భారత యుద్ధ నౌక ‘ఐ.ఎన్.ఎస్. విక్రాంత్’లో అప్పట్లో పనిచేసిన నౌకాదళ అధికారుల్ని కూడా రానా స్వయంగా కలిశారు. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ కోసం కొంతమంది నౌకాదళ అధికారుల్ని కూడా మేము కలిశాం. మా నాన్న గారు (ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు) తన పరిచయాలతో వారిని కలవడానికి సాయపడ్డారు. కానీ, అప్పటి యుద్ధ సంఘటనల వివరాలన్నీ ‘రహస్య సమాచారం’తో కూడిన ఫైల్ కావడం వల్ల అధికారులు పెద్దగా వివరాలు బయటపెట్టలేకపోయారు. ఇది యథార్థ గాథ అయినప్పటికీ, సినీ మాధ్యమానికి తగ్గట్లు కొంత స్వేచ్ఛ తీసుకొని సన్నివేశ కల్పన చేశాం. ఏమైనా, మా మటుకు నాకు ఇది అందరికీ చెప్పాల్సిన అద్భుతమైన కథ’’ అని రానా పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా... నీటిలోనే! భారీ నిర్మాణ విలువలతో జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ రెండు, మూడు రోజుల షూటింగ్ మినహా మిగతా అంతా పూర్తయిపోయింది. కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి ‘అండర్ వాటర్’ పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు. కొద్ది రోజులు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు నీటిలోనే ఉండి, షూటింగ్ చేస్తూ బాగా శ్రమపడ్డారని చిత్ర యూనిట్ సమాచారం. గ్రాఫిక్ వర్క్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్న సినిమా ఇది. అందుకే, శ్రద్ధగా చేయాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు తగినంత టైమ్ కేటాయించాలని దర్శక, నిర్మాతల భావన. అవన్నీ పూర్తి చేసుకొని, ఈ ఏడాది దసరాకు ‘ఘాజీ’ని రిలీజ్ చేస్తారు. -
విశాల్‌కు పెద్ద హిట్టు ఖాయం
తమిళంలో విశాల్ నటించిన చిత్రాలన్నీ దాదాపుగా తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఆ కోవలో సుందర్ .సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ‘అంబల’ చిత్రం తెలుగులో ‘మగమహారాజు’ పేరుతో విడుదల కానుంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో హన్సిక కథానాయిక. హిప్ హాప్ తమిళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో హీరో రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ -‘‘ఇందులో విశాల్ పోలీసాఫీసర్ పాత్ర చేశారని అర్థమవుతోంది. మంచి యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్మెంట్ కూడా ఉందని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాతో విశాల్‌కు పెద్ద హిట్టు ఖాయం’’ అని చెప్పారు. విశాల్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ మంచి పాటలిచ్చారు. కేవలం రెండు వేల అయిదు వందల రూపాయల ఖర్చుతో పాటలు పూర్తి చేశాడు. సంక్రాంతి కానుకగా తమిళ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఇంకా తెలుగు చిత్రం విడుదల తేదీని ఖరారు చేయలేదు. తెలుగులో నేను చేయబోయే స్ట్రయిట్ చిత్రం వచ్చే నెల ఆరంభమవుతుంది’’ అని చెప్పారు. సుందర్ దర్శకత్వంలో తాను చేసిన మూడో చిత్రం ఇదని హన్సిక తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, వడ్డి రామానుజం, వైభవ్, శ్రీయారెడ్డి పాల్గొన్నారు.