అమెరికాను పక్కన పెట్టి ఇండియా బాటలో..
చెన్నై: హాలీవుడ్ చిత్రాలు ఇండియా బాటపడుతున్నాయి. వందల కోట్లు పెట్టి భారీ స్థాయిలో చిత్రాలు నిర్మించి వాటిని తొలుత తమ దేశాల్లో కాకుండా భారత్ లో విడుదల చేస్తున్నారు. మల్టీ ప్లెక్స్ ల హవా మొదలవడం.. హాలీవుడ్ చిత్రాల క్రేజ్ పెరగడంతో ఇక తమ చిత్రాలను తొలుత అత్యధిక వ్యాపార అవకాశాలు ఉన్న భారతీయ స్క్రీన్ లపైకే వదులుతున్నాయి.
ఇటీవల జంగిల్ బుక్ చిత్రాన్ని నేరుగా ఇండియాలో విడుదల చేసినట్లుగానే ఇప్పుడు మరో హాలీవుడ్ చిత్రం 'ఎక్స్ మెన్ అపోకాలిప్స్' నేరుగా ఇండియాలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి బ్రియాన్ సింగర్ దర్శకత్వం వహించారు. మే 20న సినిమాను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియో ప్రకటన చేసింది.
'ఎక్స్ మెన్ చిత్రాలకు ఇండియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఆసియా దేశాలతో పోల్చుకుంటే ఇండియాలోనే ఎక్కువ. అందుకే అమెరికా కన్నా ఒక వారం రోజుల ముందుగానే ఇండియాలో విడుదల చేస్తున్నాం. ఇతర దేశాలకు దక్కని ఈ అవకాశం భారతీయులు ముందుగా ఉపయోగించుకోవాలి' అని ఫాక్స్ స్టార్ సీఈవో విజయ్ సింగ్ తెలిపారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో డబ్బింగ్ చేశారు.