
హిమక్రీములరుచికి 20 ఏళ్లు
ఎస్వీ కృష్ణారెడ్డి ‘యమలీల’ విడుదలై అప్పుడే ఇరవై ఏళ్లు అయ్యింది. కథలో బలం, దర్శకుడిలో ప్రజ్ఞ, నిర్మాతకు గట్స్ ఉంటే... స్టార్లతో ప్రమేయం లేకుండా సంచలనాలను సృష్టించొచ్చు అని రెండు దశాబ్దాల క్రితమే నిరూపించిన వెండితెర వండర్ ‘యమలీల’. ‘దానే దానే పే లిఖాహై ఖానే వాలే కా నామ్’ అని హిందీలో ఓ నానుడి ఉంది. గింజ గింజపై తినేవాడి పేరు రాసుంటుందని ఆ నానుడి అర్థం. మనిషి తినే గింజల విషయంలోనే కాదు, నటులు పోషించే పాత్రల విషయంలో కూడా ఈ నానుడి వర్తిస్తుంది. ఎవరికి ఏ పాత్ర దక్కాలో భగవంతుడు ముందే నిర్దేశిస్తాడు. దానికి ‘యమలీల’ నిర్మాణం ముందు జరిగిన కొన్ని సంఘటనలే నిదర్శనాలు.
దర్శకునిగా కృష్ణారెడ్డి తొలి సినిమా ‘మాయలోడు’. ఫాంటసీ సినిమా. ఏడాది ఆడింది. రెండో సినిమా ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’. ఇదీ పెద్ద హిట్. ఇక కృష్ణతో చేసిన ‘నంబర్‌వన్’ పేరుకు తగ్గట్టే టాప్‌హిట్. ఆ చిత్రం నిర్మాణంలోనే కృష్ణారెడ్డికి ‘యమలీల’ థాట్ వచ్చింది. రాజమహల్‌లో రాణీగా సేవలందుకోవాల్సిన తల్లి గుమస్తా ఇంట్లో తలదాచుకుంటే... తన తల్లికి పూర్వవైభవం తేవడానికి కొడుకు ఏం చేశాడు? ఇంతలో ఈ తల్లీ కొడుకులతో దైవం ఎలాంటి ఆట ఆడింది? అనేది కాన్సెప్ట్. విమానంలో కలిసి ప్రయాణిస్తుండగా, కృష్ణకు కృష్ణారెడ్డి సరదాగా ఈ కథ చెప్పారు. సూపర్‌స్టార్‌కి కథ నచ్చింది. ‘మీ అబ్బాయి మహేశ్‌కైతే బావుంటుంది’ అని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కృష్ణారెడ్డి.
‘మహేశ్ చదువుకుంటున్నాడు. ఓ రెండేళ్లాగు’ అన్నారు కృష్ణ. ఈ కథకు వెంటనే వెండితెర రూపం ఇచ్చేయాలనే కసితో ఉన్నారు కృష్ణారెడ్డి. అందుకే వేరే నటుడికోసం అన్వేషణ మొదలైంది. ముందు రాజేంద్రప్రసాద్‌ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. అప్పటికే తన సినిమాలతో స్టార్ కమెడియన్ అనిపించుకున్న అలీ గుర్తొచ్చారాయనకు. ‘అలీని హీరోగా ఎందుకు చూపించకూడదు’... కృష్ణారెడ్డి మస్తిష్కంలో ఇదే అలోచన. అలీ ముందు అగ్రిమెంట్ ఉంచారు. ఏదో కేరక్టర్ గురించేమో అని చకచకా సంతకం చేసేశారాయన. ‘ఈ సినిమాకు హీరో నువ్వే’ అనేశారు. అలీ నమ్మలేదు. తర్వాత తెలిసింది కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చెబుతుంది అబద్ధం కాదని, అక్షర సత్యమని.
ఇక హీరోయిన్. ఇందులో కథానాయిక పాత్ర కూడా కీలకమైంది. అందుకే... టాప్ పొజిషన్‌లో ఉన్న సౌందర్యను అనుకున్నారు. కానీ, స్టార్లతో చేస్తున్న సౌందర్య... అలీ పక్కన నటించడానికి ధైర్యం చేయలేకపోయారు. తన గాడ్‌ఫాదర్ అయిన కృష్ణారెడ్డికే ‘నో’ చెప్పేశారు. దాంతో ఇంద్రజ రంగంలోకొచ్చింది. ఆమెకు ఇదే తొలి సినిమా. చకచకా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు కృష్ణారెడ్డి. సంచలన విజయం. కొన్ని ఏరియాల్లో ఏడాది ఆడింది. అలీ, ఇంద్రజల ఫేట్ మారిపోయింది. ఇక ఈ సినిమాలో యమునిగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం, వీధి రౌడీ తోటరాముడిగా తనికెళ్ల భరణి తెరపై చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. పిల్లల్ని విపరీతంగా ఆకట్టుకుందీ సినిమా. ఎక్కడ విన్నా ‘యమలీల’ పాటలే. హిందీలో వెంకటేశ్ హీరోగా ‘తక్‌దీర్‌వాలా’గా విడుదలై అక్కడా ఘన విజయం సాధించింది.
అదే కసితో ‘యమలీల-2’ చేస్తున్నా
అప్పుడే ఇరవై ఏళ్లు అయ్యిందా అనిపిస్తోంది. ‘యమలీల’ విజయాన్ని తలచుకుంటేనే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఇలాంటి సినిమాను మళ్లీ ఎప్పుడు తీస్తారని చాలా మంది అడుగుతుంటారు. వారికి సమాధానమే నా ‘యమలీల-2’. క్విష్వీ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. కైకాల సత్యనారాయణగారి స్థానంలో మోహన్‌బాబు చేస్తున్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు తప్ప మిగిలిన అందరూ కొత్తవారే. కథ, కథనం కూడా కొత్తవే. కసి మాత్రం పాతదే. అదే కసితో ఈ చిత్రాన్ని చేస్తున్నాను. నా కెరీర్‌లో భారీ చిత్రమిది.
- ఎస్వీ కృష్ణారెడ్డి
మనీషా సంస్థ ప్రతిష్టను పెంచింది
1990 నుంచి 2000 వరకూ వచ్చిన టాప్ 10 చిత్రాల్లో ‘యమలీల’ ఒకటి. మా మనీషా సంస్థ ప్రతిష్టను మరింత పెంచిన సినిమా ఇది. దర్శకునిగా కృష్ణారెడ్డిని ఎదురులేని స్థానంలో కూర్చోబెట్టిందీ సినిమా. ఈ సినిమా తర్వాత ఎన్నో గొప్ప కుటుంబ కథలు తీశారు కృష్ణారెడ్డి.
- కె.అచ్చిరెడ్డి