అమర్ అక్బర్ ఆంటోని – థియెట్రికల్ ట్రైలర్
నిడివి 2 ని.02సె ,హిట్స్ 2,218,077
శ్రీను వైట్ల తొలి సినిమా ‘నీ కోసం’లో హీరో రవితేజాయే. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలసి ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ సినిమాలతో సక్సెస్ చూశారు. కాలం గడిచిపోయింది. ఇద్దరి జీవితాల్లోనూ ఎత్తుపల్లాలు వచ్చాయి. హీరోగా మళ్లీ ఒక సూపర్ హిట్ ఇవ్వాల్సిన అవసరం రవితేజాకి, దర్శకుడిగా తాన సత్తా చాటాల్సిన సందర్భం శ్రీను వైట్లకు వచ్చాయి. ‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’, ‘మిస్టర్’ సినిమాలు శ్రీను వైట్లను నిరాశ పరిచాయి. కనుక మళ్లీ ఒక మేజిక్ కోసం పాత స్నేహితుడు రవితేజాతో జోడీ కట్టాడు.
‘అమర్ అక్బర్ ఆంటోని’ ట్రైలర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం తొలి పాజిటివ్ సంకేతం. ట్రైలర్‌లో మంచి ఎనర్జీ, మేకింగ్‌లో క్వాలిటీ, నటీనటుల ప్యాడింగ్, మ్యూజిక్... అన్నీ ఊపు మీద ఉన్నాయి. కథను విదేశాల్లో నడపడం వల్ల లొకేషన్లు కూడా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. కథ ‘రివేంజ్’ పాయింటే అయితే శ్రీనువైట్ల తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీసినట్టు తెలుస్తోంది. ‘చెడ్డవాళ్ల నుంచి చెడును ఎక్స్‌పెక్ట్ చేయకపోవడం పిచ్చితనం’ వంటి పంచ్ డైలాగులు ఉన్నాయి.
‘అమర్ అక్బర్ ఆంటోని’ టైటిల్ చాలా హిట్ టైటిల్. దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ అమితాబ్‌ను హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా నేటికీ టీవీలో ఇంటిల్లిపాది కలెక్షన్లతో ఆడుతుంటుంది. ఆ క్యాచీ టైటిల్ కూడా సినిమాకు ప్లస్ కావచ్చు. ఏమైనా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిద్దాం. డిసెంబర్ 16 విడుదల.
విలేజ్ దివాలి– కామెడీ షార్ట్ ఫిల్మ్
నిడివి 10 ని. 52 సె. ,హిట్స్ 1,830,539
దీపావళి అంటే గతంలో జేబులో డబ్బులు పెట్టుకుని సంచిలో టపాకాయలు తెచ్చేవాళ్లం. ఇప్పుడు సంచిలో డబ్బులు పెట్టుకొని జేబులో టపాకాయలు తెచ్చుకునేంత ఖరీదుగా మారాయి. ఈసారి దీపావళి మీద ఫోకస్ కూడా పెరిగింది. సుప్రీంకోర్టు ఎంత సేపు టపాకాయలు కాల్చలన్న సంగతిపై తీర్పు ఇవ్వడంతో కన్ఫ్యూజన్ వచ్చింది. అయితే జనం తీర్పును దాదాపు పక్కన పెట్టిన ఉదంతాలు కనిపించాయి.
ఈ నేపధ్యంలో ‘మై విలేజ్ షో’ యూ ట్యూబ్ చానల్ వారు ‘విలేజ్ దివాలి’ ఫన్ వీడియో తీశారు. తెలంగాణ భాష మాధుర్యంతో ఆకట్టుకునే ఈ షో అక్కడి గ్రామస్తులే నటులైన కారణాన సహజరీతిలో ఉంటూ నవ్వు తెప్పిస్తుంది. ఈ షోలో ఒక పిసినారి తండ్రి టపాకాయలు కొనమని పీక్కు తినే పిల్లలను చివరకు చిల్లర తుపాకులు కొనిచ్చి ఊరుకోబెడతారు. పండక్కు అల్లుళొచ్చి అది కావాలి ఇది కావాలి అని పేచీకి దిగితే ఇద్దరు అత్తలు ఒక ప్లాన్ చేసి అల్లుళ్లను దారికి తెస్తారు. చివరలో పర్యావరణ సహిత టపాసులు కాల్చమని సందేశం కూడా ఉంది. సరదాగా చూడొచ్చు.
వినయ విధేయ రామ– టీజర్
నిడివి 0 ని.49 సె. ,హిట్స్ 11,942,34
ఇప్పుడు తెలుగులో ఉన్న మొదటి ఐదు మాస్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. హీరోను ఎలివేట్ చేసి, అతనితో ముడిపడిన ఎమోషనల్ సీన్లను ప్లాన్ చేసి, భారీ ఫైట్లు పెట్టి, బలమైన డైలాగులు పెట్టి, పట్టు సడలని కథనంతో సినిమాను గట్టున పడేయడం ఆయన శైలి. ‘రంగస్థలం’లో సెమీ రియలెస్టిక్ నటన చూపి అభినయాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు దగ్గరైన రామ్‌చరణ్ తన మాస్ అభిమానులను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ పని ‘వినయ విధేయ రామ’ తీర్చే సూచనలు టీజర్‌లో కనిపిస్తున్నాయి. మన దర్శకులు హీరోల వంశాలను, వారి తండ్రుల గొప్పతనాన్ని వదిలిపెట్టరు. ఈ సినిమారో హీరో పేరు ‘రామ్ కొణిదల’ అట. పాత్రను గుర్తించేలోపు దాని నుంచి బయటపడేసే ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తారో. టైటిల్ బాగానే ఉన్నా బోయపాటి గత టైటిల్ ‘జయ జానకి నాయక’ వరుసలోనే ఉంది. భారీతనం మెండుగా ఉన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment