'అర్జున్ రెడ్డి'పై నిషేధం విధించండి
విజయవాడ పోలీసు సంయుక్త కమిషనర్‌కు వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: 'అర్జున్ రెడ్డి' సినిమాపై వివాదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ: సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా వున్న అర్జున్ రెడ్డి సినిమాను తక్షణం నిషేదించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నగర జాయింట్ పోలీస్ కమిషనర్ రమణకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా కారణంగా యువత పెడదోవ పట్టే ప్రమాదం వుందని వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సినిమాల కారణంగా సామాజిక విలువలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'అర్జున్ రెడ్డి' సినిమాపై ఇప్పటికే పలువురు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ సినిమా ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించేదిగా ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్వయంగా సినిమా చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకు, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ చిత్రం చాలా బాగుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడాన్ని ఆయన విమర్శించారు.