'యుద్ధం శరణం' మూవీ రివ్యూ | Yuddham Sharanam Movie Review | Sakshi
Sakshi News home page

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ

Published Fri, Sep 8 2017 12:10 PM | Last Updated on Fri, Sep 22 2017 10:46 AM

Yuddham Sharanam Movie Review

టైటిల్ : యుద్ధం శరణం
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
తారాగణం : నాగచైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రావూ రమేష్, రేవతి..
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : కృష్ణ ఆర్వీ మారిముత్తు
నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య యుద్ధం శరణం సినిమాతో మరోసారి మాస్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. చిన్ననాటి స్నేహితుడు కృష్ణ ఆర్వీ మారిముత్తును దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి విలన్ గా పరిచయం అవుతుండటం కూడా ఈ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. మరి యుద్ధం శరణం ఆ అంచనాలను అందుకుందా..?  మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు నాగచైతన్య చేసిన యుద్ధంలో గెలిచాడా..?

కథ :
అర్జున్ (నాగ చైతన్య) ఉదయం తొమ్మిదింటినుంచి సాయంత్రం ఐదింటికి వరకు రొటీన్ ఉద్యోగం చేయటం ఇష్టం లేని కుర్రాడు. జీవితంలో ఏదైన సాధించాలన్న పట్టుదలతో డ్రోన్ తయారు చేసే పనిలో ఉంటాడు. అమ్మ సీతాలక్ష్మీ (రేవతి), నాన్న మురళీ కృష్ణ(రావూ రమేష్)లే అర్జున్ ప్రపంచం. అక్క రాధిక, చెల్లెలు ధనుతో కలిసి అల్లరి చేస్తూ, ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తూ హ్యాపిగా లైఫ్ గడిపేస్తుంటాడు. తన తల్లి దండ్రుల 30వ పెళ్లిరోజును గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలని చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తాడు.

కానీ అదే రోజు అర్జున్ వాళ్ల అమ్మానాన్న కనిపించకుండాపోతారు. ఒక్కసారిగా అర్జున్ జీవితం తలకిందులవుతుంది. అమ్మా నాన్నకు ఏమైందో తెలుసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ చివరకు ఓ యాక్సిడెంట్ లో వాళ్లు చనిపోయారని తెలుస్తుంది. కానీ అది యాక్సిడెంట్ కాదని ఎవరో కావాలనే వాళ్లను చంపేశారన్న అర్జున్ కుటుంబానికి అనుమానం వస్తుంది. అదే సమయంలో నాయక్ అనే క్రిమినల్ అర్జున్ ఫ్యామిలీ వేటాడటం మొదలు పెడతాడు.  అర్జున్ కుటుంబాన్ని నాయక్ ఎందుకు చంపాలనుకున్నాడు..? అర్జున్ వాళ్ల అమ్మానాన్నల చావుకు నాయక్ కు సంబంధం ఏంటి..? నాయక్ లాంటి రాక్షసుణ్ని అర్జున్ ఎలా ఎదిరించి గెలిచాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
కెరీర్ స్టార్టింగ్ నుంచి సీరియస్ రోల్లో ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నాగచైతన్య యుద్ధం శరణం సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేశాడు. అయితే పూర్తి మాస్ సబ్జెక్ట్ కాకుండా థ్రిల్లర్ జానర్ ను ఎంచుకొని సక్సెస్ సాధించాడు. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే నాగచైతన్య నటనలో మంచి పరిణతి కనిపించింది. లావణ్య త్రిపాఠి పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కేవలం కథలో పాటలు రొమాన్స్ కోసమే ఆమె పాత్రను ఇరికినట్టుగా అనిపించింది. అయితే ఉన్నంతలో గ్లామర్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది.

సీనియర్ నటులు రేవతి, రావూ రమేష్ లు తమ అద్భుతమైన నటనతో సీతా లక్ష్మీ, మురళీ కృష్ణల పాత్రలకు ప్రాణం పోశారు. కుటుంబాన్ని ప్రేమిస్తూనే సమాజానికి ఏదైన సాయం చేయాలనే తపన పడే పాత్రలో ఒదిగిపోయారు. విలన్ గా మరోసారి తెలుగు తెర మీద కనిపించిన శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో అలరించాడు. లుక్స్ తో పాటు నటనలోనూ విలనిజాన్ని అద్భుతంగా పండించాడు. సిస్టర్ క్యారెక్టర్ లో సీమా చౌదరి నటన ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, రాజా రవీంద్ర, ప్రియదర్శి, రవివర్మలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
తొలి సినిమాగా ఓ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ను ఎంచుకున్న దర్శకుడు కృష్ణ ఆర్వీ మారిముత్తు మంచి విజయం సాధించాడు. తొలి భాగం ఫ్యామిలీ, లవ్ సీన్స్ తో కాస్త నెమ్మదిగా నడిపించినా.. రెండో భాగంలో ఆడియన్స్ ను కట్టిపడేశాడు. యాక్షన్ సీన్స్ తో పాటు హీరో విలన్ ల మధ్య సాగే మైండ్ గేమ్ ఆడియన్స్ కు థ్రిల్ కలిగిస్తుంది. అయితే లవ్ స్టోరి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కలగటానికి బలమైన కారణం కనిపించదు. సినిమాకు మేజర్ ఎసెట్ సినిమాటోగ్రాఫర్ నిఖేత్ బొమ్మిరెడ్డి. డ్రోన్ సీన్స్ తో పాటు నైట్ విజన్ కెమెరాతో షూట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. వివేక్ సాగర్ సంగీతం పరవాలేదు. ఫ్యామిలీ సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
ఫ్యామిలీ ఎమోషన్స్
హీరో, విలన్ల మైండ్ గేమ్

మైనస్ పాయింట్స్ :
లాజిక్ లేని లవ్ స్టోరి
స్లో నేరేషన్

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement