అధ్వానంగా ఉన్న డ్రెయినేజీ , జ్వరంతో బాధపడుతున్న మహిళ
సాక్షి, తిరుమలగిరి (నాగార్జునసాగర్) : అపరిశుభ్రతో... కలుషిత తాగునీరో... కారణమేదో కానీ ఆ తండాను జ్వరం మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరల్ ఫివతో తండా వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. జబ్బు చేసిందని హాస్పిటల్‌కు వెళితే మందు గోళీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లినా డబ్బులు ఖర్చవుతున్నాయే తప్ప రోగం మాత్రం నయం కావడం లేదంటూ తండా వాసులు వాపోతున్నారు. తండాలో ఇప్పటి వరకు 100 మందికి పైగా జ్వరంతో మంచం పట్టగా ఒక్కో కుటుంబానికి రూ. 20వేలకు పైగానే ఖర్చయిందని, అయినా జబ్బు నయం కావడం లేదంటున్నారు.
ఇదీ తిరుమలగిరి మండలం సఫావత్ తండా పరిస్థితి. తండాలో 756 మంది జనాభా ఉన్నారు. ఈ తండాలో ఎక్కువగా రైతులు, కూలీలే ఉన్నారు. వీళ్లు బతుకుదెరువు కోసం చుట్టుపక్కల కూలి పనికి వెళ్తుంటారు. సుమారు ఇరవై రోజులుగా వీరి కుటుంబ సభ్యులకు జ్వరం వస్తుంది. దాంతో మిర్యాలగూడ, హాలియా వంటి పెద్దాసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేసినా జ్వరం మాత్రం నయం కావడం లేదంటున్నారు. రోజూ వచ్చే కూలి పోతుందని, ఉన్న డబ్బులు కూడా ఖర్చవుతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
అపరిశుభ్రతకు నిలయంగా..
మండలంలోని సఫావత్‌తండా అపరిశుభ్రతకు నిలయంగా మారింది. తండాలో డ్రెయినేజీలు లేకపోవడంతో ఇళ్లలోని మురుగునీరు మొత్తం రోడ్డుపైకి చేరి రోజుల కొద్దీ నీరు నిల్వ ఉంటుంది. అదే విధంగా తండాలో పెంటదిబ్బలు ఇళ్లమధ్యలోనే ఉండటం, తండాకు సరఫరా అయ్యే మంచినీటి ట్యాంకులను కూడా శుభ్రపరచకపోవడంతో అపరిశుభ్రతకు నిలయంగా మారింది. గిరిజన ప్రజలకు మరుగుదొడ్లపై అవగాహన కల్పించాల్సి ఉన్నా వారు మనకేంటిలే అని వ్యవహరిస్తుండటంతో తండాలో కనీసం 30 శాతం మేరకూడా మరుగుదొడ్లు లేవు. దాంతో మలమూత్రాలను రోడ్డువెంటనే విసర్జిస్తున్నారు. దీంతో తండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
అవగాహన కార్యక్రమాలేవీ..?
పరిసరాల పరిశుభ్రత... రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ వైద్యఆరోగ్యí సిబ్బంది ఆ దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. ప్రజలకు రోగాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతోనే ప్రజలు అవస్థలు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ వైద్యం అందించాలి..
తండాలోని ప్రజలంతా జ్వరాలతో బాధపడుతున్నారు. అంతా కూలి పనులు చేసుకొని బతి కేటోళ్లమే. రోగం వస్తే చూపించుకునే స్థోమత కూడా మాకు లేదు. ప్రై వేట్ వైద్యం చేయించుకోవాలంటే అప్పు చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థోమతలేకపోవడం, ప్రభుత్వ వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.
– సఫావత్ పాండు
20 వేలకు పైగా ఖర్చయింది..
పదిహేను రోజుల నుంచి జ్వరం వస్తుంది. హాలియా, మిర్యాలగూడలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకుంటే ఇప్పటి వరకు రూ.20వేలకు పైగా ఖర్చయింది. అయినా రోగం తగ్గలే. చేతిలో ఉన్న పైసలు కూడా అయిపోవడంతో వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇంటిబాట పట్టినం. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన వైద్యం అందించాలి.
– సఫావత్ మంగి, సఫావత్‌తండా
Comments
Please login to add a commentAdd a comment