
జాట్ ఉద్యమం హింసాత్మకం
కాల్పుల్లో ఒకరి మృతి.. 25 మందికి గాయాలు
♦ హరియాణాలోని 9 జిల్లాల్లో ఆందోళనలు.. పలుచోట్ల కర్ఫ్యూ
♦ మంత్రి స్కూలు, ఎమ్మెల్యే కార్యాలయానికి ఆందోళనకారుల నిప్పు..
రోహ్‌తక్: ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ.. హరియాణాలో జాట్‌లు చేస్తున్న ఆందోళన ఉధృతంగా మారింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో.. హరియాణా సర్కారు తొమ్మిది జిల్లాల్లో ఆర్మీని రంగంలోకి దించింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి స్కూలుతో పాటు పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ ఘటనలో గుర్తుతెలియని ఆందోళనకారుడు.. ఓ బీఎస్‌ఎఫ్ జవానుపై దాడికి ప్రయత్నించాడు. తప్పించుకోవడానికి జవాను కాల్పులు జరపటంతో ఆందోళనకారుడు మృతిచెందాడని డీజీపీ యశ్‌పాల్ సింఘాల్ వెల్లడించారు.
వేర్వేరుచోట్ల జరిగిన గొడవల్లో 25 మందికి ఆందోళనకారులకు గాయాలయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును ఆసుపత్రికి తీసుకెళ్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసి ఆ వాహనాన్ని కూడా జాట్లు దగ్ధం చేశారు. మరోవైపు రోహ్‌తక్‌తోపాటు ఝాజ్జర్, హంసీ, భివానీ, కైతాల్, పానిపట్, గురుగావ్ ప్రాంతాల్లోనూ జాట్ కార్యకర్తల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు 3300 మంది పారామిలటరీ బలగాలను కేంద్రం.. హరియాణాకు పంపించింది. శాంతి భద్రతల విషయంపై సీఎం ఖట్టర్‌తో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. సాధారణ పరిస్థితులు నెలకొనేంతవరకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
మరోవైపు ఢిల్లీ-హిస్సార్, ఢిల్లీ-అంబాలా జాతీయ రహదారిపై మూడోరోజూ ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరియాణా రాష్ట్ర మంత్రి కెప్టెన్ అభిమన్యుకు చెందిన స్కూలు, షాపింగ్‌మాల్‌ను నిరసనకారులు తగులపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే మనిష్ కుమార్ క్యాంప్ ఆఫీసును నిరసనకారులు తగులపెట్టారు. రోహ్‌తక్, భివానీ నగరాల్లో కర్ఫ్యూ విధించారు. పలుచోట్ల కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను కూడా జారీచేసింది. ఆందోళనలు ఆపితే.. రిజర్వేషన్ అంశాన్ని పరిశీలిస్తామని.. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో శాంతి, భద్రతలు కాపాడాలని పిలుపునిచ్చారు. సీఎం ప్రకటనను జాట్ నాయకులు తిరస్కరించారు. రిజర్వేషన్‌పై అసెంబ్లీలో బిల్లు పెట్టేంతవరకు ఆందోళన ఆపేదిలేదని హెచ్చరించారు. కాగా, మూడ్రోజులుగా జరుగుతున్న ఆందోళనలతో రూ. 200 కోట్ల నష్టం వాటిల్లిందని, దాదాపు 600 రైళ్లు రద్దయ్యాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పలుచోట్ల వందల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న రోహ్‌తక్‌లో అధికారులు ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలను నిలిపేశారు. రాష్ట్రంలోని శాంత్రి భద్రతలు అదుపు తప్పడంతో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పరీకర్, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు శుక్రవారం రాత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరక్టర్‌లు పాల్గొన్నారు.
స్పెషల్ బీసీ హోదా ఇస్తాం
రిజర్వేషన్లకోసం ఆందోళన చేస్తున్న జాట్లకు ప్రత్యేక వెనుకబడిన తరగతుల (ఎస్‌బీసీ) కోటా ఇవ్వాలని నిర్ణయించినట్లు హరియాణా వ్యవసాయమంత్రి ఓపీ ధంకార్ (జాట్) వెల్లడించారు. జాట్లు లేవనెత్తిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమని.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగా.. తక్షణమే.. 10-20 శాతం రిజర్వేషన్లు పొందుతారని వెల్లడించారు.