న్యూఢిల్లీ : హరియాణాలో జాట్ల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతను శనివారం అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. రాజ్నాథ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజు హజరయ్యారు.
హరియాణాలోని భద్రతా ఏర్పాట్లపై రాజ్నాథ్ సింగ్...వారితో సమీక్ష జరిపారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ.. జాట్‌లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నిరసనకారుల ఆందోళన శనివారం కూడా హింసాత్మకంగా మారింది. జింద్ రైల్వే స్టేషన్ను ఆందోళనకారులు తగులబెట్టారు.
అంతేకాకుండా బీజేపీ ఎంపీ షైనీ నివాసంపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో రోహ్తక్, భివాని, ఝజ్జర్లలో కర్ఫ్యూ కొనసాగుతోందని డీజీపీ వైపీ సింఘల్ తెలిపారు. కాగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హరియాణాలో 10 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి. మరో 23 కంపెనీల బలగాలను కూడా కేంద్రం అక్కడకు పంపిస్తోంది.
అలాగే ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న జాట్లకు ప్రత్యేక వెనుకబడిన తరగతుల (ఎస్‌బీసీ) కోటా ఇవ్వాలని నిర్ణయించినట్లు హరియాణా వ్యవసాయమంత్రి ఓపీ ధంకార్ ప్రకటించినా ...ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.