రోహ్తక్: జాట్ల ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ హరియాణాలో జాట్లు శనివారం కూడా విధ్వంసానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్ కార్యాలయంతో పాటు హోటల్స్, పలు దుకాణాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు అనంతరం రహదారులపై బైఠాయించారు. ఇవాళ ఉదయం కూడా పలు బస్సులను దగ్ధం చేశారు. జాట్లు ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధం చేయడంతో ఆర్మీ జవాన్లు హెలికాప్టర్ ద్వారా హరియాణా చేరుకుంటున్నారు.
కాగా ఆందోళన హింసాత్మకంగా మారడంతో రోహ్తక్, భివాని ప్రాంతాల్లో పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్వర్వులు జారీ చేశారు. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు. అలాగే కేంద్రం కూడా పారామిలటరీ బలగాలను హరియాణాకు పంపుతోంది. ఇక ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు గాల్లోకి జరిపిన కాల్పుల్లో నిన్న ఓ ఆందోళనకారుడు మృతి చెందిన విషయం తెలిసిందే.