భారత్ మ్యాప్‌లో తప్పుంటే రూ.100 కోట్ల ఫైన్ | 100 crores fine for publishing wrong maps of india soon | Sakshi
Sakshi News home page

భారత్ మ్యాప్‌లో తప్పుంటే రూ.100 కోట్ల ఫైన్

Published Fri, May 6 2016 5:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

భారత్ మ్యాప్‌లో తప్పుంటే రూ.100 కోట్ల ఫైన్

భారత్ మ్యాప్‌లో తప్పుంటే రూ.100 కోట్ల ఫైన్

భారత భౌగోళిక, నైసర్గిక సరిహద్దులకు సంబంధించి మ్యాప్‌లను ఆన్‌లైన్‌లో తప్పుగా చూపిస్తే, తప్పుడు మ్యాప్‌లను ప్రచురిస్తే గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష, కోటి రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం తాజాగా ముసాయిదా బిల్లును రూపొందించింది. జమ్మూ కశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్‌లో అంతర్భాగంగా, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా ఇటీవల కొన్ని ఆన్‌లైన్ మ్యాపుల్లో చూపించిన కారణంగా భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా నివారించేందుకు కేంద్రం 'జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్-2016'ను రూపొందించింది.

ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్ ఇండియాను నిర్వహించాలంటే గూగుల్ సంస్థ కూడా భారతదేశంలోని సంబంధిత అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా గూగుల్ లాంటి సంస్థలు తగిన ఫీజును చెల్లించి లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త సంస్థలు అయితే ముందుగానే లైసెన్సులు తీసుకోవాలి. భారత నైసర్గిక ప్రాంతాలకు సంబంధించి శాటిలైట్, ఏరియల్, బెలూన్, మానవ రహిత విమానాలు తీసుకునే ఫొటోలు, రూపొందించే మ్యాప్‌లు, గ్రాఫిక్స్ ఏవైనా ఆన్‌లైన్‌లో, ఇంటర్నెట్ ఫ్లాట్‌ఫామ్‌లపై, ఎలక్ట్రానిక్ రూపంలో ప్రసారం చేయాలన్నా, ప్రచురించాలన్నా కేంద్రప్రభుత్వం లైసెన్స్ ఉండాల్సిందే. సర్వేలతో ప్రచురించే మ్యాప్‌లు, గ్రాఫిక్‌లకు కూడా లైసెన్స్ ఉండాల్సిందే.

భారత భూభాగాలకు సంబంధించిన ఫొటోలు, మ్యాప్‌లు, గ్రాఫిక్స్ సవ్యంగా ఉన్నాయా, లేదా? అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు 'సెక్యూరిటీ వీటోయింగ్ అథారిటీ' అనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అధిపతిగా ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ స్థాయి లేదా చైర్మన్ స్థాయి ఉద్యోగి ఉంటారు. ఈ కమిటీలో ఓ సాంకేతిక నిపుణుడు, జాతీయ భద్రతా నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను పరిశీలించి లైసెన్స్‌ను మంజూరుచేసే అధికారంతోపాటు దరఖాస్తులను తిరస్కరించే అధికారం కూడా ఈ వీటోయింగ్ అథారిటీకి ఉంటుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement