పళని భేటీకి 111 మంది ఎమ్మెల్యేల హాజరు
చెన్నైః తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న క్రమంలో తమిళనాడు సీఎం పళనిస్వామి నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి 111 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారని మత్స్య శాఖ మంత్రి, ఏఐఏడీఎంకే నేత డీ జయకుమార్ చెప్పారు. సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలు సైతం ఫోన్‌లో తమ మద్దతు తెలిపారని వెల్లడించారు. సీఎం నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ సమావేశం తీర్మానం చేసినట్టు తెలిపారు.
దినకరన్ శిబిరంలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతిస్తామని ఫోన్ ద్వారా సమాచారం అందించారని చెప్పారు. తాజా భేటీతో పళనిస్వామి శిబిరంలో ఉత్సాహం నెలకొందని భావిస్తున్నారు. గత నెల 28న జరిగిన సమావేశానికి కేవలం 75 మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారని వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలను దినకరన్ వర్గం నిశితంగా పరిశీలిస్తోంది.