ల్యాప్ టాప్ కొనాలని రూ.లక్ష ఎత్తుకెళ్లిన బాలుడు
తిరువనంతపురం: ఇంట్లో వాళ్లు తాను అడిగింది కొనివ్వలేదని ఓ బాలుడు ఏకంగా లక్ష రూపాయలతో ఇంటి నుంచి ఉడాయించాడు. కేరళలోని కోజీకోడ్ జిల్లా కొండాట్టికి చెందిన ఏడవ తరగతి విద్యార్థి ల్యాప్ కొనివ్వాలని తండ్రిని అడిగాడు. అయితే అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంట్లో ఎవరికి తెలియకుండా మే 30 వ తేదీన బీరువా నుంచి రూ.1 లక్ష రూపాయలు తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడు. రూ.30 వేలతో ల్యాప్టాప్ కొని, మిగతా డబ్బుతో షికారుకు బయలుదేరాడు. కొచ్చికి వెళ్లడానికి మే 31 న కర్ణాటక బస్సు ఎక్కాడు.
లేడీ కండక్టర్ కు ఆ విద్యార్థి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని గ్రహించి దగ్గరలోని కరుంగపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించింది. పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందిచ్చారు. వారు అక్కడకు వచ్చి తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లారు. తన కుమారుడిది ల్యాప్టాప్ వాడే వయసు కాదని, అందుకే ఇప్పడే ఎందుకని కొనివ్వలేదని పీడబ్లూడీ ఇంజినీరుగా పనిచేస్తోన్న తండ్రి తెలిపారు. కానీ కొడుకు ప్రవర్తన పట్ల తాను అసంతృప్తికి లోనయ్యానని చెప్పుకొచ్చారు.