27 రోజులు.. 13 బిల్లులు
ఉభయ సభలు నిరవధిక వాయిదా
సమావేశాలను విజయవంతంగా ముగించిన మోడీ సర్కారు
న్యూఢిల్లీ: దాదాపు నెల రోజుల పాటు కొనసాగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం ఉభయసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొలిసారిగా బడ్జెట్ సమావేశాలను ఎదుర్కొన్న ప్రధాని నరేంద్రమోడీ సర్కారు సభలకు అంతరాయం కలగకుండా, స్వల్ప వాయిదాలతో విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలో మారిన రాజకీయ వాతావరణాన్ని ఇవి ప్రతిబింబించాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు 167 గంటల పాటు కొనసాగగా గతేడాది యూపీఏ సర్కారు హయాంలో 19 గంటల 36 నిమిషాలే నిర్వహించారు.
కేంద్ర బడ్జెట్‌తోపాటు రైల్వే బడ్జెట్‌ను ఈ సమావేశాల్లో ఆమోదించారు. జాతీయ జ్యుడీషియల్ కమిషన్ నియామక బిల్లు, సెబి తదితర బిల్లులను ఆమోదించారు. ట్రాయ్ మాజీ చీఫ్ నృపేంద్ర మిశ్రాను ప్రధాని ముఖ్య కార్యదర్శిగా నియమించటంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను ఈ సమావేశాల్లోనే అధిగమించారు.
ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీ బడ్జెట్‌ను కూడా పార్లమెంట్ ఆమోదించింది.బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో 13 బిల్లులు ఆమోదం పొందాయి.లోక్‌సభ సమావేశాలు 167 గంటలపాటు, రాజ్యసభ సమావేశాలు 142 గంటలపాటు జరిగాయి. పార్లమెంట్ 27 రోజుల పాటు సమావేశమైంది.లోక్‌సభ సమావేశాలకు 14 గంటల పాటు అంతరాయం కలిగినా 28 గంటల 10 నిమిషాల పాటు అదనంగా చర్చించటం ద్వారా నష్టాన్ని పూరించింది.వాయిదాలు, అంతరాయాలతో రాజ్యసభ 34 గంటల కాలాన్ని కోల్పోయినా అదనంగా 38 గంటల పాటు పనిచేసింది.