ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్
వచ్చే నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
తొలి రెండు రోజుల్లో రాష్ర్టపతి ప్రసంగం, చర్చ, ధన్యవాద తీర్మానం
26న రైల్వే బడ్జెట్, 27న ఆర్థిక సర్వే నివేదిక సమర్పణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. 28న సాధారణ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఆ రోజు శనివారమైనప్పటికీ పార్లమెంట్ ప్రత్యేకంగా భేటీకానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పిస్తారు. అంతకుముందు రోజు, అంటే ఫిబ్రవరి 27న ఆర్థిక సర్వే నివేదికను, 26న రైల్వే బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెడుతుంది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఇక్కడ సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ షెడ్యూల్‌ను రాష్ర్టపతి ఆమోదం కోసం సిఫారసు చేసింది. సాధారణంగా ఫిబ్రవరి ఆఖరి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. చివరి రోజు శనివారం అవుతున్నందున అదే రోజున బడ్జెట్‌ను ప్రవేశపెడతామని, గతంలో కూడా దీన్ని పాటించారని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది జరగనున్న తొలి పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. అనంతరం దీనిపై చర్చ, ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో వీటిని చేపడతారు. ఈ తొలి విడ త బడ్జెట్ సమావేశాలు మార్చి 20 వరకు కొనసాగుతాయి.
నెల రోజుల విరామం తర్వాత ఏప్రిల్ 20 నుంచి రెండో విడత సమావేశాలు జరుగుతాయి. ఈ విరామ సమయంలో వివిధ మంత్రిత్వ శాఖల డిమాండ్లను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. వాటికి నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకుంటాయి. మే 8తో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఇటీవలి కాలంలో తీసుకొచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం ప్రయత్నించనుంది. బొగ్గు-గనులు, ఖనిజాలు, ఇ-రిక్షాలు, పౌరస్మృతి చట్ట సవరణ, భూసేకరణ, బీమా రంగంలో విదేశీ నిధులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం తెచ్చేందుకు సర్కారుపై తీవ్ర ఒత్తిడి ఉంది. కాగా, హడావుడిగా ఆర్డినెన్స్‌లు తేవడంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ల వివరాలను పార్లమెంట్‌లో వెల్లడిస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తొలి విడతలో 26 రోజులపాటు, మలివిడతలో 19 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం 66 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.