ఆర్థిక వృద్ధికి సర్కారు రోడ్‌మ్యాప్
బడ్జెట్‌పై చర్చకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: దేశ ఆర్థికరంగ పునరుత్తేజానికి రోడ్‌మ్యాప్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. సాధారణ బడ్జెట్‌పై జరిగిన చర్చకు శుక్రవారం లోక్‌సభలో సమాధానమిస్తూ.. పన్ను విధానాల్లో పరివర్తన, కనిష్ట పన్ను రేట్లు, సబ్సీడీ వ్యవస్థను హేతుబద్ధీకరించడం, మౌలిక వసతులు, గృహనిర్మాణ రంగానికి ఊతం.. సహా ఆర్థికరంగ పునరుత్తేజానికి చేపట్టనున్న పలు ప్రణాళికలను వివరించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు, సమాజంలో అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు వ్యాపార అనుకూల విధానాలు తప్పనిసరి అని జైట్లీ చెప్పారు. ప్రస్తుత ఆర్థికరంగ ప్రస్తుత దుస్థితికి గత యూపీఏ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కీలక రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించడం సహా బడ్జెట్‌లో పేర్కొన్న పలు ప్రతిపాదనలు పారిశ్రామిక, ఉత్పత్తిరంగ అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు అత్యవసరమని జైట్లీ వివరించారు.
నిరుత్సాహపూరిత పన్ను విధానాల వల్ల గత కొన్నేళ్లుగా పెట్టుబడిదారుల్లో భారత్‌పై అనుమానాలు బలపడ్డాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ పన్ను రేట్ల విధానం వల్ల దేశీయంగా ఉత్పత్తి పెరుగుతుందని, పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని తెలిపారు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచడాన్ని జైట్లీ సమర్థించారు. కాగా, జైట్లీ గోవర్ధన గిరినెత్తిన శ్రీకృష్ణుడి వలె ఒంటిచేత్తో ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన్నారని స్పీకర్ సుమిత్రా మహాజన్ కొనియాడారు.