రాయితీలు.. ఉపాధి.. వృద్ధి!
ఇదీ... బడ్జెట్ ముందు కోర్కెల చిట్టా
మరో వారం రోజులే ఉంది. అందరూ ఎదురుచూస్తున్న 2016-17 సాధారణ బడ్జెట్‌ను 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మోదీ సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. దీనిపై పారిశ్రామిక వర్గాలు భారీ ఆశలే పెట్టుకున్నాయి. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి మూడేళ్లలో 25 శాతానికి తెస్తామన్న ప్రభుత్వం... అందుకోసం రాయితీలకు కోత వేస్తుందన్న వార్తలు చర్చనీయమవుతున్నాయి.
మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న... మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలకు బడ్జెట్‌లో ఏ మేరకు ప్రాధాన్యమిస్తారన్నది ఆర్థిక వేత్తల్లో ఆసక్తికరంగా మారింది. టెలికం సహా ఐటీ రంగం సైతం ఇంకా కొన్ని మినహాయింపులను కోరుతున్న నేపథ్యంలో... బడ్జెట్‌పై నిపుణులేమంటున్నారు? ఏ రంగం ఏం కోరుకుంటోంది? ఆర్థికవేత్తల మాటేంటి? ఇవన్నీ మీకోసం అందిస్తోంది ‘సాక్షి బిజినెస్’. ఈ రోజు నుంచే...
ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీపై దృష్టి
భారత్‌లో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముడి చమురు, పసిడి తరువాత వీటి దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ తయారీకి దేశంలో మౌలిక సదుపాయాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ విభాగంపై బడ్జెట్ దృష్టి పెట్టాలి. ఐటీ హార్డ్‌వేర్ తయారీలో వినియోగించే కొన్ని ఉత్పత్తుల దిగుమతులపై గత బడ్జెట్‌లో స్పెషల్ అదనపు సుంకం (ఎస్‌ఏడీ) మినహాయింపులు ఇవ్వడం ఈ రంగానికి ఊరటనిచ్చింది. రానున్న బడ్జెట్ నుంచి పరిశ్రమ కోరుతున్నవివీ...
♦ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌కు వర్తించే సుంకాలు, టారిఫ్‌లను ఇతర ఆసియా దేశాల స్థాయికి తగ్గించాలి.
♦ ఎల్‌సీడీ ప్యానల్స్, ఎఫ్‌ఏబీ, ఇతర ప్రొడక్టుల తయారీ ప్రోత్సాహానికి పలు పథకాలను ప్రారంభించాలి. ఇది దేశీయ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ రంగం పురోగతికి దోహదం చేస్తుంది.
♦ డేటా సెంటర్ల ఏర్పాటుకు విధాన పరమైన మద్దతు అవసరం. కనీస ప్రత్యామ్నాయ పన్నును (మ్యాట్) తగ్గించాలి.
♦ ఈ రంగానికి సంబంధించి చిన్న తరహా పరిశ్రమల్లో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించాలి.
♦ స్మార్ట్ సిటీ చొరవలకు తగిన ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ రూపకల్పన అవసరం. ఈ దిశలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలి. - డాక్టర్ అరుణ్ సింగ్, సీనియర్
ఎకనమిస్ట్-డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఉపాధి పెంచేలా ఉండాలి...
దేశంలో డిమాండ్ పెరగడానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడటం అవసరం. ఈ విషయంపై బడ్జెట్ దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం. దీనివల్ల ఇటు గ్రామాల్లో, అటు పట్టణాల్లో వినియోగపరమైన డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది పారిశ్రామిక వృద్ధికి దోహదం చేస్తుంది. ముడిచమురు ధరలు తీవ్రంగా పతనమవటం వల్ల మన దిగుమతుల బిల్లు తగ్గింది. ఈ భారీ లాభాల్ని వృద్ధి బాటకు మళ్లించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మౌలిక రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో తగిన చర్యల వల్ల మధ్య తరగతి ప్రజల చేతికి కొంత డబ్బు అందే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎఫ్‌ఎంసీజీ రంగం తిరిగి చక్కటి వృద్ధి దిశలోకి మళ్లే వీలు కల్పిస్తుంది. దీనితోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, సబ్సిడీల వంటి ప్రయోజనాలను కల్పించడం వంటి చర్యలు రైతాంగం ఆర్థిక ప్రయోజనాలకు దోహదపడతాయి. విద్యా, నైపుణ్యం పెంపు చర్యలతో పాటు వస్తు, సేవల పన్ను వంటి సంస్కరణలు వృద్ధిని దీర్ఘకాలంలో పటిష్టం చేస్తాయి. - వివేక్ గంభీర్, ఎండీ- జీపీసీఎల్
‘బ్యాడ్ బ్యాంకు’కు ఇదే సమయం...
బ్యాంకింగ్ రంగం ఇపుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీనిపై బడ్జెట్లో ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. ‘‘మొండిబకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో పాటు బ్యాంకులకు తాజా మూలధనమివ్వటం కూడా ప్రధానమే. బ్యాంకింగ్ రంగం పునరుద్ధరణకు బడ్జెట్ ద్వారా స్పష్టమైన ఎజెండా నిర్దేశించాలి. రద్దు చేసినవి, మొండిబకాయిలు కాకుండా... మొండిబకాయిలుగా మారే అవకాశమున్న రుణాలే దాదాపు రూ.6.5 లక్షలకు చేరాయి. బ్యాంకింగ్ తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాలను చూడ్డానికి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చెయ్యాలి.
అందుకు తగిన సమయమిదే’’ అని సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో వివరించింది. ఇబ్బందుల్లో ఉన్న ఆస్తుల్ని కొనుగోలు చేయటం, లేదా స్వాధీనం చేసుకుని, పునర్‌వ్యవస్థీకరించడం, నిర్వహించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చెయ్యాలని సంస్థ పేర్కొంది. ‘‘వృద్ధికి బయటి దేశాలపై ఆధారపడకూడదు. దేశీయంగా చక్కని మార్కెట్ ఏర్పాటు లక్ష్యంగా పన్ను వ్యవస్థలో సవరణలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. దీనితోపాటు ద్రవ్యలోటు లక్ష్యాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వైదొలగబోమన్న స్పష్టమైన సంకేతం వెలువడాలి’’ అని సంస్థ కోరింది. బడ్జెట్ అనంతరం ఆర్‌బీఐ రేటు రెపోను 25 బేసిస్ పాయింట్లకన్నా ఎక్కువగా తగ్గించే అవకాశం ఉందని కూడా సంస్థ అభిప్రాయపడింది.
స్టార్టప్స్‌కు పన్ను రాయితీలు అవసరం
స్టార్టప్స్ ప్రస్తుతం తీవ్ర నిధుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారం దిశగా వీటికి సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల (కనీస ప్రత్యామ్నాయ పన్ను సహా) ప్రోత్సాహకాలు అవసరం. నిధుల సమీకరణ భారాన్ని కొంత తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది. అలాగే కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రద్దు వల్ల స్టార్టప్స్‌ను ఎంతగానో ప్రోత్సహించినట్లవుతుంది.
- బీవీఆర్ మోహన్ రెడ్డి, నాస్కామ్- చైర్మన్
ఈసారి పరిమితంగా బడ్జెట్ కాపీల ముద్రణ
న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుల మేరకు ఈసారి ఆర్థిక సర్వే, బడ్జెట్ కాపీల సంఖ్యను తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం ఈ రెండు డాక్యుమెంట్ల ప్రతులను ఆర్థిక శాఖ ఆన్‌లైన్‌లో ఉంచనుంది. మీడియా సంస్థలకు పంపే ప్రతుల సంఖ్యను కూడా తగ్గించేయనుంది. ఈసారి వాటికి ఆర్థిక సర్వే, బడ్జెట్ కాపీల ప్రతులు మూడు మాత్రమే లభిస్తాయి. ఇప్పటిదాకా అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ ఈ కాపీలు అందుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 26న ఆర్థిక సర్వేను, 29న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.