ఇది గుజరాత్‌ ‘కోటా’ | 134 infant deaths in 2 Gujarat hospitals | Sakshi
Sakshi News home page

ఇది గుజరాత్‌ ‘కోటా’

Published Mon, Jan 6 2020 4:36 AM | Last Updated on Mon, Jan 6 2020 4:36 AM

134 infant deaths in 2 Gujarat hospitals - Sakshi

తల్లిదండ్రుల అవగాహనారాహిత్యమో, పౌష్టికాహారం అందించని ప్రభుత్వ వైఫల్యమో, సరిగా చికిత్స అందించని ఆస్పత్రుల నిర్లక్ష్యమో, డిసెంబర్‌లో పెరిగిన చలి వలనో.. కారణమేదైనా వీటికి మూల్యం శిశువులు చెల్లిస్తుండగా, కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నాయి. రాజస్తాన్‌లోని ఆస్పత్రిలో ఒకే నెలలో 100 మందికిపైగా  శిశువులు మరణించారంటూ వచ్చిన గణాంకాలు మరువక ముందే గుజరాత్‌లోని రెండు ఆస్పత్రులలో కలిపి అంతకు రెట్టింపు మరణాలు నమోదైనట్లు వచ్చిన గణాంకాలు వేదనను కలిగిస్తున్నాయి.

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో డిసెంబర్‌ నెలలో 111 మంది శిశువులు మృత్యువాత పడినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితో పాటు అహ్మదాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో 88 మంది శిశువులు మరణించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి నితిన్‌ పటేల్‌ వెల్లడించారు. ప్రజల్లో అవగాహన లేమి, పౌష్ఠికాహారలోపం, చలితీవ్రత ఈ మరణాలకు కారణాలని ఆయన అన్నారు. రెండు దశాబ్దాలతో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగిందన్నారు. డాక్టర్ల కొరత ఉందని, ఇది దేశవ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. 2017 లెక్కల ప్రకారం గుజరాత్‌తో పోలిస్తే బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ వ్యవహారంపై మాట్లాడాల్సిందిగా ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీని మీడియా కోరగా  సమాధానం ఇవ్వలేదు.

శిశుమరణాల గణాంకాలు..
రాజ్‌కోట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో గత డిసెంబర్‌లో 388 మంది శిశువులు చేరగా, వారిలో 111 మంది మరణించారు. అహ్మదాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో డిసెంబర్‌లో 415 మంది శిశువులు చేరగా, వారిలో 88 మంది మరణించారు.  

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
శిశుమరణాలు ప్రభుత్వాన్ని కలచివేయడం లేదా అని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్‌ చావ్దా ప్రశ్నించారు. రెండు ఆస్పత్రుల్లోనే 200 మంది మరణించారని, రాష్ట్రంలోని మొత్తం ఆస్పత్రులను కలిపితే ఇంకా ఎక్కువే ఉంటాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement