
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ బరిలో ఉన్న 977 మంది అభ్యర్థుల్లో దాదాపు 15 శాతం మంది అంటే 137 మందిపై నేరారోపణలు ఉన్నట్టు వెల్లడైంది.వీరిపై హత్య, కిడ్నాప్, అత్యాచారం వంటి తీవ్ర నేరారోపణలు నమోదైనట్టు అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన ఎన్‌జీవోలు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), గుజరాత్ ఎలక్షన్ వాచ్ వెల్లడించాయి.
ఈ 137 మంది అభ్యర్థుల్లో 78 మంది సీరియస్ క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే 89 మంది బీజేపీ అభ్యర్థుల్లో 10 మందిపై తీవ్ర నేరారోపణలు నమోదవగా, తొలివిడత పోలింగ్‌లో 20 మంది నేరచరితులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కాయని వెల్లడైంది.ఇక బీఎస్‌పీ నుంచి 8 మంది, ఎన్‌సీపీ నుంచి ముగ్గురు, ఆప్ తరపున ఒక అభ్యర్థి నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఎనిమిది మందిపై హత్యకేసులు నమోదవగా, ముగ్గురిపై కిడ్నాప్ కేసులు, ఒకరిపై అత్యాచార కేసు నమోదైందని తేలింది. మాజీ జేడీ(యూ) ఎంఎల్‌ఏ చోటూ వసావ కుమారుడు మహష్ వసావ 24 కేసులతో ఈ జాబితాలో ముందువరసలో ఉన్నట్టు ఎన్‌జీవోల నివేదిక తెలిపింది. ఆయనపై దోపిడీ, కుట్ర, అల్లర్లు, చోరీ, కిడ్నాపింగ్ వంటి అభియోగాలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment