
హొసపేటె/రాయచూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక మూడునెలల్లోనే రెండోసారి భారీ వరద ముప్పును ఎదుర్కొంటోంది. కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుధవారం ఆల్మట్టి డ్యాం నుంచి సుమారు 3.75 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యాం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కృష్ణా, తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా, ఉప నది మలప్రభ వరదల కారణంగా బాగల్‌కోట, బెళగావి, విజయపుర, యాదగిరి, రాయచూరు జిల్లాలు విలవిలలాడుతున్నాయి. అత్యధికంగా బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకాలో పదులసంఖ్యలో గ్రామాలు నీటమునిగాయి. నీటిలో కొట్టుకుపోయి, మిద్దెలు కూలి ఇప్పటివరకు సుమారు 15 మంది మరణించారు. వేలాది హెక్టార్లలో పంటపొలాలు నీటమునిగాయి. బళ్లారి, రాయచూరు జిల్లాలో ముఖ్యమైన వంతెనలు నీటమునగడంతో రాకపోకలు స్తంభించాయి. నిరాశ్రయులైన వేలాది మంది నీళ్లు, ఆహారం కోసం అలమటిస్తున్నారు. వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని సీఎం యడియూరప్ప కలెక్టర్లను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment