మంటల్లో ఆయుధాగారం | 16 Dead In Fire At Pulgaon, Army's Largest Ammunition Depot In India | Sakshi
Sakshi News home page

మంటల్లో ఆయుధాగారం

Published Wed, Jun 1 2016 1:06 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

మంటల్లో ఆయుధాగారం - Sakshi

మంటల్లో ఆయుధాగారం

16 మంది మృతి, 17 మందికి గాయాలు  
మహారాష్ట్రలోని పల్గావ్‌లో దుర్ఘటన

 
 పల్గావ్: మహారాష్ట్రలోని పల్గావ్‌లో ఉన్న కేంద్ర ఆయుధాగారంలో సోమవారం అర్థరాత్రి దాటాక మంటలు చెలరేగడంతో 16 మంది మరణించారు. 17 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆర్మీ సిబ్బందితోపాటు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్దదైన పల్గావ్ ఆయుధాగారంలో ఒంటిగంట దాటాక మంటలు మొదలయ్యాయి. తెల్లవారుజాము వరకూ అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రయత్నంలో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు, ఒక జవాను, 13 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

మరో ఇద్దరు అధికారులతో పాటు 9 మంది జవాన్లు, ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని సైనిక ఆపరేషన్స్ డైరక్టర్ జనరల్ లెఫ్టినెంట్ రణబీర్ సింగ్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని, విచారణకు ఆర్మీ ఆదేశించిందని చెప్పారు. ప్రాధమిక నివేదికల ప్రకారం తెల్లవారుజాము ఒంటి గంట ప్రాంతంలో భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్న ఒక షెడ్డులో మంటలు ప్రారంభమయ్యాయి. వెంటనే డిపోలో ఉన్న అగ్నిమాపక దళాలు, క్విక్ రియాక్షన్ బృందాలు రంగంలోకి దిగి మంటల్ని అదుపుచేశాయి. దీంతో మంటలు మరో షెడ్‌కు మంటలు వ్యాపించకుండా అదుపుచేశారని సింగ్ తెలిపారు. గాయపడ్డవారిని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్దా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలియగానే పుణె నుంచి ఆర్మీ వైద్య బృందాలు ఘటన స్థలికి తరలివెళ్లాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ పుణె నుంచి ప్రమాద స్థలికి బయల్దేరి వెళ్లారు. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా ప్రమాద స్థలిని సందర్శించారు.

 విద్రోహ చర్య కారణం కాదు: పరీకర్
 కేంద్ర ఆయుధాగారం అగ్నిప్రమాదంలో ఎలాంటి విద్రోహ చర్య చోటుచేసుకోలేదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. విచారణ అనంతరమే అసలు కారణం తెలుస్తుందని, ఇప్పుడే ఊహాగానాలు చేయడం సరికాదన్నారు. సంబంధిత విభాగాలు తక్షణం స్పందించడంతో మంటల్ని అదుపు చేశామని చెప్పారు.

 ప్రధాని మోదీ తీవ్ర సంతాపం
 ఈ ప్రమాదం తననెంతో బాధించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఘటనపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మొరాకో, ట్యునీసియా పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా తీవ్ర సంతాపం తెలుపుతూ... ఘటన తననెంతో కలచివేసిందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
 
 పల్గావ్‌లోనే కీలక ఆయుధ సంపత్తి
 పల్గావ్‌లోని కేంద్ర ఆయుధాగారంనాగ్‌పూర్‌కు 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడు వేల ఎకరాల్లో విస్తరించిన ఈ డిపోలో భారత్ సైన్యానికి చెందిన కీలక ఆయుధాల్ని భద్రపరుస్తారు. బాంబులు, గ్రెనేడ్స్, షెల్స్, రైఫిల్స్, మిస్సైల్స్ ఇతర పేలుడు పదార్థాల్ని వివిధ ఫ్యాక్టరీల్లో తయారయ్యాక ముందుగా ఇక్కడికి తరలించి నిల్వ చేస్తారు. పేలుళ్లతో పల్గావ్ సమీపంలోని గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కిటీకి అద్దాలు పగలడంతో పాటు పైకప్పులు ఊగడంతో భూకంపం వచ్చిందేమోనని ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. 1989, 1995ల్లో కూడా ఆయుధాగారంలో ప్రమాదాల్ని చూసిన వృద్ధులు మాత్రం ఆందోళన చెందవద్దంటూ వారికి నచ్చచెప్పారు. అగర్‌గావ్, పిప్రి, నచన్‌గావ్, మంగేజ్‌హరి గ్రామస్థులు తెల్లవారుజాము వరకూ ఆందోళనల మధ్య ఆరుబయటే ఉన్నారు.



 అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న   రక్షణమంత్రి పరీకర్. చిత్రంలో ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement