Defence Minister parikar
-
మంటల్లో ఆయుధాగారం
16 మంది మృతి, 17 మందికి గాయాలు మహారాష్ట్రలోని పల్గావ్‌లో దుర్ఘటన పల్గావ్: మహారాష్ట్రలోని పల్గావ్‌లో ఉన్న కేంద్ర ఆయుధాగారంలో సోమవారం అర్థరాత్రి దాటాక మంటలు చెలరేగడంతో 16 మంది మరణించారు. 17 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆర్మీ సిబ్బందితోపాటు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్దదైన పల్గావ్ ఆయుధాగారంలో ఒంటిగంట దాటాక మంటలు మొదలయ్యాయి. తెల్లవారుజాము వరకూ అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రయత్నంలో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు, ఒక జవాను, 13 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు అధికారులతో పాటు 9 మంది జవాన్లు, ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని సైనిక ఆపరేషన్స్ డైరక్టర్ జనరల్ లెఫ్టినెంట్ రణబీర్ సింగ్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని, విచారణకు ఆర్మీ ఆదేశించిందని చెప్పారు. ప్రాధమిక నివేదికల ప్రకారం తెల్లవారుజాము ఒంటి గంట ప్రాంతంలో భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్న ఒక షెడ్డులో మంటలు ప్రారంభమయ్యాయి. వెంటనే డిపోలో ఉన్న అగ్నిమాపక దళాలు, క్విక్ రియాక్షన్ బృందాలు రంగంలోకి దిగి మంటల్ని అదుపుచేశాయి. దీంతో మంటలు మరో షెడ్‌కు మంటలు వ్యాపించకుండా అదుపుచేశారని సింగ్ తెలిపారు. గాయపడ్డవారిని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్దా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలియగానే పుణె నుంచి ఆర్మీ వైద్య బృందాలు ఘటన స్థలికి తరలివెళ్లాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ పుణె నుంచి ప్రమాద స్థలికి బయల్దేరి వెళ్లారు. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా ప్రమాద స్థలిని సందర్శించారు. విద్రోహ చర్య కారణం కాదు: పరీకర్ కేంద్ర ఆయుధాగారం అగ్నిప్రమాదంలో ఎలాంటి విద్రోహ చర్య చోటుచేసుకోలేదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. విచారణ అనంతరమే అసలు కారణం తెలుస్తుందని, ఇప్పుడే ఊహాగానాలు చేయడం సరికాదన్నారు. సంబంధిత విభాగాలు తక్షణం స్పందించడంతో మంటల్ని అదుపు చేశామని చెప్పారు. ప్రధాని మోదీ తీవ్ర సంతాపం ఈ ప్రమాదం తననెంతో బాధించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఘటనపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మొరాకో, ట్యునీసియా పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా తీవ్ర సంతాపం తెలుపుతూ... ఘటన తననెంతో కలచివేసిందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పల్గావ్లోనే కీలక ఆయుధ సంపత్తి పల్గావ్లోని కేంద్ర ఆయుధాగారంనాగ్పూర్కు 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడు వేల ఎకరాల్లో విస్తరించిన ఈ డిపోలో భారత్ సైన్యానికి చెందిన కీలక ఆయుధాల్ని భద్రపరుస్తారు. బాంబులు, గ్రెనేడ్స్, షెల్స్, రైఫిల్స్, మిస్సైల్స్ ఇతర పేలుడు పదార్థాల్ని వివిధ ఫ్యాక్టరీల్లో తయారయ్యాక ముందుగా ఇక్కడికి తరలించి నిల్వ చేస్తారు. పేలుళ్లతో పల్గావ్ సమీపంలోని గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కిటీకి అద్దాలు పగలడంతో పాటు పైకప్పులు ఊగడంతో భూకంపం వచ్చిందేమోనని ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. 1989, 1995ల్లో కూడా ఆయుధాగారంలో ప్రమాదాల్ని చూసిన వృద్ధులు మాత్రం ఆందోళన చెందవద్దంటూ వారికి నచ్చచెప్పారు. అగర్గావ్, పిప్రి, నచన్‌గావ్, మంగేజ్‌హరి గ్రామస్థులు తెల్లవారుజాము వరకూ ఆందోళనల మధ్య ఆరుబయటే ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న రక్షణమంత్రి పరీకర్. చిత్రంలో ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్ -
సియాచిన్‌ను వదులుకోం: పరీకర్
న్యూఢిల్లీ: సియాచిన్ గ్లేసియర్‌ను ఖాళీ చేయబోమని రక్షణమంత్రి పరీకర్ అన్నారు. ఒక వేళ దానిని ఖాళీ చేస్తే, వ్యూహాత్మక ప్రాంతమైన సియాచిన్‌ను పాకిస్తాన్ ఆక్రమించుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విషయం చెప్పారు. పాక్ సియాచిన్‌ను ఆక్రమించుకుంటే అది మనకు ప్రమాదకరమని, భారత్ మరింతమంది ప్రాణాలను కోల్పోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. క్లిష్టమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న జవాన్ల మేలుకోసం ఏడో వేతనసంఘం పలు సిఫారసులు చేసిందని, అయితే అవేమిటో ప్రస్తుతం చెప్పలేనని మంత్రి పరీకర్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమాచారం ► ఆగ్నేయాసియాలో నమోదవుతున్న 70శాతం మలేరియా కేసులు భారత్‌నుంచి వచ్చినవే. ఇందులో మరణాలే ఎక్కువని సర్కారు తెలిపింది. ► రైళ్లో మనం కప్పుకునే దుప్పట్లను రెండు నెలలకోసారి ఉతుకుతారని.. బెడ్‌రోల్స్, బెడ్షీట్లను రోజూ ఉతుకుతారని రైల్వేశాఖ సహాయమంత్రి వెల్లడించారు. ► 2012నుంచి మహిళల హక్కుల ఉల్లంఘనపై 93వేల కేసులు, పిల్లలపై 45వేలకు పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ► తాజా జనాభా లెక్కల ప్రకారం లింగనిష్పత్తి 933 నుంచి 943 పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. 2012-14 మధ్య కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఐదుశాతం పెరిగినట్లు వెల్లడించింది. ► {V>Ò$×, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు ‘హార్డ్ ఏరియా’ అలవెన్సును అదనంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ► వ్యవసాయాధారిత భూముల సంఖ్య దేశంలో తగ్గుతోందని, వ్యవసాయ ఉత్పత్తిలో పెరుగుదల ఉందని తెలిపింది. ► బీడీ కట్టపై పుర్రె గుర్తు ముద్రణతో మెజారిటీ బీడీ తయారీ యూనిట్లు మూతబడ్డాయని సీపీఎం ఎంపీ రాజ్యసభలో తెలిపారు. ప్రభుత్వం మానవతాధృక్పథంతో ఆలోచించి తెరిపించాలన్నారు. -
ఓఆర్ఓపీ నోటిఫికేషన్ విడుదల
నెరవేరిన సైనికుల డిమాండ్ న్యూఢిల్లీ: సైనికులు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’(ఓఆర్ఓపీ) పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఒకే ర్యాంకులో పనిచేసి గతంలో రిటైరైన ఉద్యోగులకు.. అదే ర్యాంకులో పనిచేసి 2013 తర్వాత రిటైరైన ఉద్యోగులతో సమానంగా పెన్షన్ అందనుంది. 2014 జూలై 1 నుంచి ఈ పథకం వర్తించనుంది. ఇకపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ విధానాన్ని సమీక్షించనున్నారు. దీని వల్ల 25లక్షల సైనికుల కుటుంబాలు ప్రయోజనం కలుగుతుంది. సర్వీసు కాలం పూర్తవకముందే.. వివిధ కారణాలతో రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఈ పథకం వర్తించదని నోటిఫికేషన్లో పేర్కొంది. పథకం అమల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ 6నెలల్లో నివేదిక సమర్పించనుంది. కాగా, నోటిఫికేషన్ సరిగా లేదని, తమ డిమాండ్లను సర్కారు పరిగణనలోకి తీసుకోలేదని నిరసన చేస్తున్న సైనికోద్యోగులు విమర్శించారు. ఐదేళ్లకోసారి దీన్ని సమీక్షించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని.. సర్కారు దీన్ని ‘వన్ ర్యాంక్ ఫైవ్ పెన్షన్స్’ గా మార్చేసిందన్నారు. సెప్టెంబర్ 5న రక్షణమంత్రి పారికర్ ప్రకటించిన విధివిధానాలే ఇందులో ఉన్నాయని.. మేజర్ జనరల్ సత్బీర్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తామని చెప్పినా బిహార్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యమైంది. అయితే.. గురువారం చివరి విడత ఎన్నికలు పూర్తయ్యాక పారికర్ స్పందించారు. దీపావళికి ముందే శుభవార్త ఉంటుందన్నారు. ఈ పథకం అమలుతో కేంద్ర ప్రభుత్వంపై 8 నుంచి 10వేల కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.