ఓఆర్‌ఓపీ నోటిఫికేషన్ విడుదల | orop issued notification | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఓపీ నోటిఫికేషన్ విడుదల

Published Sun, Nov 8 2015 1:01 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

orop issued notification

నెరవేరిన సైనికుల డిమాండ్
 
 న్యూఢిల్లీ: సైనికులు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’(ఓఆర్‌ఓపీ) పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఒకే ర్యాంకులో పనిచేసి గతంలో రిటైరైన ఉద్యోగులకు.. అదే ర్యాంకులో పనిచేసి 2013 తర్వాత రిటైరైన ఉద్యోగులతో సమానంగా పెన్షన్ అందనుంది. 2014 జూలై 1 నుంచి ఈ పథకం వర్తించనుంది. ఇకపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ విధానాన్ని సమీక్షించనున్నారు. దీని వల్ల  25లక్షల సైనికుల కుటుంబాలు ప్రయోజనం కలుగుతుంది. సర్వీసు కాలం పూర్తవకముందే.. వివిధ కారణాలతో రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఈ పథకం వర్తించదని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పథకం అమల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ 6నెలల్లో నివేదిక సమర్పించనుంది. కాగా, నోటిఫికేషన్ సరిగా లేదని, తమ డిమాండ్లను సర్కారు పరిగణనలోకి తీసుకోలేదని నిరసన చేస్తున్న సైనికోద్యోగులు విమర్శించారు. ఐదేళ్లకోసారి దీన్ని సమీక్షించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని.. సర్కారు దీన్ని ‘వన్ ర్యాంక్ ఫైవ్ పెన్షన్స్’ గా మార్చేసిందన్నారు. సెప్టెంబర్ 5న రక్షణమంత్రి పారికర్ ప్రకటించిన విధివిధానాలే ఇందులో ఉన్నాయని..  మేజర్ జనరల్ సత్బీర్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తామని చెప్పినా బిహార్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యమైంది. అయితే.. గురువారం చివరి విడత ఎన్నికలు పూర్తయ్యాక  పారికర్  స్పందించారు. దీపావళికి ముందే శుభవార్త ఉంటుందన్నారు. ఈ పథకం అమలుతో కేంద్ర ప్రభుత్వంపై 8 నుంచి 10వేల కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement