
తండ్రిపై కక్షతో కూతురుపై దారుణం
ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగికదాడి చోటుచేసుకుంది. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిలో ఆమెకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి కూడా ఉన్నాడు.
అనంతరం ఆమె నోరు, చేతులు, కాళ్లు కట్టేసి ఓ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తిస్తూ దాదాపు తొమ్మిది రోజులపాటు లైంగికదాడికి తెగబడి అనంతరం విడిచిపెట్టారు. దీంతో బాధితురాలు, ఆమె తండ్రి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, స్థానిక పోలీసులకు కాకుండా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, స్థానిక పోలీసులపై నమ్మకం లేకే ఇలా చేసినట్లు చెప్పారు.
తన తండ్రిపై ఉన్న రాజకీయ కక్షతోనే వారు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది. గత పంచాయతీ ఎన్నికల్లో వారు వ్యతిరేకించిన వ్యక్తికి తన తండ్రి మద్దతిచ్చాడనే కక్షతో తనపై దుర్మార్గానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.