'రికార్డు టైమ్ లో సెన్సేషనల్ కేసుల పరిష్కారం'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గతేడాది నేరాలు 17 శాతం పెరిగాయి. 2015లో 182,644 కేసులు నమోదయినట్టు ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో 27 శాతం(49,903) కేసులను పరిష్కరించారు. గతేడాది తమ పనితీరు పట్ల ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ సంతృప్తి వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం తమ పట్ల ప్రజలకు పెరుగుతున్న విశ్వాసానికి ప్రతీకగా ఆయన వర్ణించారు.
'మేక అపహరణ నుంచి రూ. 20 చోరీ వరకు ప్రతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నందుకు సంతృప్తిగా ఉంది' అని విలేకరుల సమావేశంలో కమిషనర్ అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వంటివి బాగా తగ్గాయని చెప్పారు. తీవ్రమైన కేసుల పరిష్కారంలో 2014తో పోలిస్తే మెరుగయ్యామని వెల్లడించారు. సంచలనాత్మక కేసులన్నింటినీ రికార్డు టైమ్ లో పరిష్కరించామని చెప్పారు.