
రెండు వేలమంది వైద్యుల సమ్మె
న్యూఢిల్లీ: తమ కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం నుంచి నిరవధిక ఆందోళనలకు దిగుతున్నట్టు వారు ప్రకటించారు. పని ప్రదేశాల్లో భద్రత, కనీస మౌలిక అవసరాలు, సమయానికి జీతభత్యాల చెల్లింపు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వారు పోరాటానికి దిగారు.
ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న సుమారు 20 ఆసుపత్రులకు చెందిన ప్రభుత్వ వైద్యులు సుమారు 2000 మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో వైద్యసేవలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సఫ్దర్ జంగ్, మౌలానా అజాద్, రామ్ మనోహర్ లోహియా తదితర ఆసుపత్రులలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో మాత్రమే రోగులకు సేవలందిస్తున్నారు.