కోర్టుకెక్కిన 200 మంది జవాన్లు
ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోర్టును ఆశ్రయించారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న దాదాపు 200 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమకు సరైన తిండి పెట్టడం లేదని, అలవెన్సులు ఇవ్వట్లేదని, పని చేసే పరిస్థితులు కూడా ఘోరంగా ఉన్నాయని అంటూ తమకు న్యాయం చేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విమానాశ్రయాలతో పాటు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భద్రతా బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది చూసుకుంటారు. కేంద్ర భద్రతా దళాలలో భాగమైన సీఐఎస్ఎఫ్‌తో పాటు వివిధ దళాలు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తున్నాయి. గత మూడేళ్లలో 344 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 15 మంది ఇలా అసువులు బాశారు. పనిచేసే పరిస్థితులు దుర్భరంగా ఉండటం, తీవ్రమవుతున్న ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల వేధింపులు.. ఇలా రకరకాల కారణాలతో వీళ్లు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు.