చెన్నై : చెన్నిమలై సమీపంలోని కడుమనల్‌లో జరిగిన తవ్వకాల్లో 2,300 ఏళ్ల నాటి సమాధులు బయల్పడ్డాయి. ఈరోడ్ జిల్లా, చెన్నిమలై సమీపంలోని నొయ్యల్ నదీతీరంలో కడుమనల్ గ్రామముంది. ఇక్కడ సుమారు రెండువేల ఏళ్ల క్రితం నాటి మనుష్యుల ఆవాసాలకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. 1981 నుంచి తంజావూరు, తమిళవర్సిటీ, రాష్ట్ర పురావస్తుశాఖ, పుదుచ్చేరి వర్సిటీ ఆధ్వర్యంలో కడుమనల్‌లో తవ్వకాలు జరుపుతూ వచ్చారు. ఈ తవ్వకాల్లో కడుమనల్‌లో 2 వేల ఏళ్ల క్రితమే మనుష్యులు ఉన్నత నాగరికతతో జీవించిన ఆధారాలు లభించాయి. విదేశాల్లో వాణిజ్య సంబంధాలు జరిగినట్లు, బంగారు ఆభరణాలు తయారీ, వివిధ వర్ణాల ప్రశస్తమైన రాళ్లకు నగిషీ పరిశ్రమలున్నట్లు కనుగొన్నారు. నెల రోజులుగా రాష్ట్ర పురావస్తుశాఖ ప్రాజెక్టు డైరక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో ఏడుగురు కడుమనల్ ప్రాంతంలో తవ్వకాలు పనులు జరుపుతున్నారు.
ఇందులో కడుమనల్‌లోని కల్లకాడు ప్రాంతంలో సుమారు 2,300 ఏళ్ల నాటి క్రితం ప్రజలు ఉపయోగించిన సమాధులు, అదే ప్రాంతంలోని కెలావనక్కాడు అనే చోట పరికరాలు, హారాలు తయారుచేస్తూ వచ్చిన పరిశ్రమల ఆనవాళ్లు కనుగొన్నారు. దీనిపై జె.రంజిత్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కొడుమనల్‌లో ప్రస్తుతం 8వ విడత తవ్వకాలు పనులు జరుపుతున్నామని, ఇక్కడ సుమారు 250 ప్రాంతాలలో సమాధులు బయల్పడినట్లు తెలిపారు. నాగరికతకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment