వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 3.46 పెంపు
వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.3.46 పెరిగింది. డీల్లర్లకు చెల్లించే కమిషన్ మొత్తాన్ని ప్రభుత్వం 9 శాతం పెంచడంతో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. 14.2 కిలోల సిలిండర్‌పై డీలర్ల కమిషన్‌ను రూ.3.46 పెంచడంతో వారి కమిషన్ రూ.40.71 చేరుకుంది. ఫలితంగా సిలిండర్ అమ్మకపు ధర రూ.3.46 మేర పెరగనుందని చమురు మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. పెంచిన కమిషన్ మొత్తం వినియోగదారులపైనే పడుతుందని, కొత్త ధర మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ బండ ధర రూ.410.50 ఉండగా, ధర పెంపు అనంతరం రూ.413.96కి చేరింది.
మరోవైపు 5 కిలోల సిలిండర్‌పై కూడా డీలర్ల కమిషన్‌ను రూ.1.73 పెంచారు. దీంతో వారి కమిషన్ రూ.20.36కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 5 కిలోల సిలిండర్ ధర రూ.353 ఉంది. వేతనాలు, భత్యాల వంటి వ్యయం పెరిగిన నేపథ్యంలో డీలర్ల కమిషన్ పెంచినట్టు ఆ అధికారి తెలిపారు. అయితే సబ్సిడీ లేని సిలిండ్లరపై డిస్టిబ్యూటర్లకు అదనంగా ఇస్తున్న 75 పైసల కమిషన్ మొత్తంలో ఎలాంటి మార్పూ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.1,017.50గా ఉంది.