వస్తోంది.. మరో ‘టచ్’ విప్లవం!
ప్రయోజనాలు చాలానే...
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లే కాదు.. అన్ని డిజిటల్ తెర(డిస్‌ప్లే)లూ 3డీ టచ్‌స్క్రీన్‌ల వల్ల మారిపోనున్నాయి. వినోదం, ఆర్కిటెక్చర్, ఫొటోగ్రఫి, గేమింగ్ వంటి రంగాల్లో కొత్త మార్పులు, పద్ధతులు వస్తాయి.
మొన్న.. టిక్‌టిక్‌మంటూ టైప్ రైటర్
నిన్న.. టక్‌టక్‌మంటూ కీబోర్డు
నేడు.. చడీచప్పుడూ లేని టచ్‌స్క్రీన్
మరి రేపు..?
టచ్‌స్క్రీన్లపై బటన్లు మొలవబోతున్నాయి!
3డీ టచ్‌స్క్రీన్లు మరో టచ్ విప్లవం సృష్టించబోతున్నాయి!!
కంప్యూటర్ అంటే.. మౌస్, క్లిక్కులు ఉండాల్సిందేనా? అవసరం లేదు.. స్క్రీన్‌పై టచ్ చేస్తే చాలు అంటూ యాపిల్ ఐపాడ్ ఐదేళ్ల క్రితం టచ్ విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కించింది. తొలుత బటన్లు పోయి టచ్‌స్క్రీన్లు వచ్చాయి. మౌస్ క్లిక్కుల స్థానంలో టచ్‌లు చేరాయి. ఈ కోవలోనే మరో ట్యాబ్లెట్ విప్లవం రాబోతోంది. టచ్‌స్క్రీన్‌పై బటన్లు మొలుస్తాయి. బటన్లు నొక్కుతూ అక్షరాలు టైప్ చేసుకోవచ్చు. అవసరం తీరగానే బటన్లు మాయమవుతాయి. ట్యాబ్లెట్లకు 3డీ టచ్‌స్క్రీన్‌లను జోడిస్తే జరిగే అద్భుతాలు ఇవి. సమీప భవిష్యత్తులో ఈ 3డీ టచ్‌స్క్రీన్ టెక్నాలజీతో డిజిటల్ తెర(డిస్‌ప్లే)ల రూపురేఖలూ మారిపోనున్నాయి.
పిక్సెల్స్ నుంచి బటన్లు...
మొబైల్‌ఫోన్ టీవీ రిమోట్ అవుతుంది. వీడియోగేమ్ కంట్రోలర్‌గానూ మారుతుంది. తిరిగి మొబైల్‌ఫోన్ అవతారమెత్తుతుంది. ఇంటర్‌ఫేస్‌ల మార్పుతో ఇలా 3డీ తాకే తెరలు రూపుమారుస్తాయి. టాక్టస్ టెక్నాలజీ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ‘మార్ఫింగ్ టచ్‌స్క్రీన్’ను తీసుకు వస్తోంది. ‘ఫోరమ్’ పేరుతో ఐపాడ్ మినీకి ఉపయోగపడే ఓ 3డీ టచ్ స్క్రీన్‌ను ఈ కంపెనీ తయారు చేసింది. ఐపాడ్ మినీకి సరిపోయే ఫోరమ్ 3డీ టచ్‌స్క్రీన్ కేస్ ధర సుమారు రూ.9 వేలు. టచ్ చేసినప్పుడు కలిగే ఒత్తిడి ఆధారంగానే ఈ టచ్‌స్క్రీన్ పనిచేస్తుంది. దీనికి ఎలాంటి అదనపు విద్యుత్ అవసరం లేదు.
3డీ తెర.. ఎలా సాధ్యం?
3డీ టచ్‌స్క్రీన్‌పై సమాచారాన్ని ప్రదర్శించడం, ప్రసారం చేయడం, ఫిల్టర్ చేయడం, లైన్లు, కాలమ్స్‌గా విభజించడం, వ్యాఖ్యలు రాయడం వంటివి ‘డైనమిక్ బార్స్’ వల్ల సాధ్యం అవుతాయి. పొడవాటి ట్యూబ్‌లా ఉండే వీటిలో ప్రత్యేక ద్రవం ఉంటుంది. ఇవి కాంతి, ఒత్తిడి ఆధారంగా వాటంతట అవే యాక్టివేట్ అవుతాయి. ద్రవం కదలికలకు అనుగుణంగా బటన్లు పనిచేస్తాయి. వీటితో కీబోర్డు మాదిరిగా టచ్‌స్క్రీన్‌పై ఓ ‘డైనమిక్ బార్ చార్టు’ ఆవిష్కృతం అవుతుంది. ఒక్కో బటన్‌ను నొక్కొచ్చు. పైకి లాగొచ్చు. రకరకాలుగా టచ్ చేయడం ద్వారా రకరకాల కమాండ్లు ఇవ్వొచ్చు. అవసరం లేనప్పుడు ఇవి ఆటోమేటిక్‌గా లోపలికి వెళ్లిపోతాయి. ఈ టెక్నాలజీతో టచ్‌స్క్రీన్ల బరువు, సైజేమీ పెరగకపోవడం అసలు విశేషం. అలాగే ఏ కంప్యూటర్ తెరనైనా 3డీతెరగా మార్చాలంటే.. అది ‘షేప్‌క్లిప్’ అనే టూల్స్ వల్ల సాధ్యం అవుతుంది. తెర నుంచి వెలువడే కాంతిని బట్టి.. దానిపైన ఉండే స్థలంలో ఈ క్లిప్‌లు నియంత్రణతో పనిచేస్తాయి.