శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా పంజ్గమ్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో భద్రతా దళాలు ప్రతిగా ఎదురు కాల్పులు జరిపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఘటనా స్థలంలో మూడు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి. కాగా జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని బ్రిగేడియర్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. హతమైనవారిలో ఇద్దరు హిజబుల్ ముజాహిద్దీన్, ఒకరు ఎల్ఈటీ ఉగ్రవాదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.