Hizbul Mujhahdeen militant
-
కశ్మీర్లో 18 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్: శ్రీనగర్ శివారులో దాదాపు 18 గంటలపాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు చనిపోగా ఒక జవానుకు గాయాలయ్యాయి. మరో ఘటనలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ శివార్లలోని బందిపొరా రోడ్డు ముజ్గుంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు, భద్రతా బలగాలు శనివారం రాత్రి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు. రెండు వర్గాల మధ్య దాదాపు 18 గంటలపాటు హోరాహోరీగా కాల్పులు కొనసాగాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు బలగాలు సుమారు ఐదు ఇళ్లను పేల్చి వేశారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఒక జవానుతోపాటు ముగ్గురు పౌరులు గాయపడ్డారు. మృతులను బందిపొరా జిల్లా హజిన్ ప్రాంతానికి చెందిన ముదసిర్ రషీద్ పర్రే(16), సకీబ్బిలాల్ షేక్‌గా గుర్తించారు. అయితే, పర్రే వయస్సుతోపాటు, అతడు ఉగ్రవాదో కాదో నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తిని పాక్‌కు చెందిన అలీగా అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం ఈ ప్రాంతంలో భద్రతా బలగాలతో స్థానికులు ఘర్షణలకు దిగటంతో పెల్లెట్లు, బాష్పవాయువును ప్రయోగించి వారిని చెదరగొట్టారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోఘటనలో..యువతను ఉగ్రవాద ముసుగులోకి లాగుతున్న కిష్త్వార్ జిల్లా సౌందర్ దచ్చాన్ గ్రామానికి చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపు ఉగ్రవాది రియాజ్ అహ్మద్‌ను బలగాలు అరెస్టు చేశాయి. ఇతడు కరడుగట్టిన ఉగ్రవాది మొహమ్మద్ అమిన్ అలియాస్ జహంగీర్‌కు సన్నిహితుడని పోలీసులు తెలిపారు. ఏకే–47 చేత పట్టుకుని ఉన్న రియాజ్ అహ్మద్ ఫొటోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పరింపొరా ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనతో ఇతనికి సంబంధమున్నట్లు గుర్తించారు. యువతను ఉగ్ర ఉచ్చులోకి లాగడంలో రియాజ్ నిపుణుడని అధికారులు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన జహంగీర్ కిష్త్వార్ ప్రాంతంలో చాలాకాలంగా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. -
‘నాన్నా..నన్ను క్షమించు’
శ్రీనగర్ : కచిదూర ఎన్కౌంటర్లో మృతిచెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఎతిమాద్ హుసేన్ మాలిక్ సరిగ్గా ఎన్కౌంటర్ ముందు తన తండ్రికి చేసిన ఫోన్‌కాల్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రతా బలగాల చేతికి చిక్కడానికి కొద్ది నిమిషాల ముందు ఎతిమాద్ ఆరు నిమిషాల పాటు మాట్లాడాడు. ‘తప్పించుకోవడానికి మేము చాలా ప్రయత్నించాము. కానీ ప్రయోజనం లేకపోయింది. నన్ను క్షమించు నాన్నా’ అంటూ హుసేన్ తండ్రికి క్షమాపణలు చెప్పాడు. అయితే హుసేన్ మాటలు విన్న అతని తండ్రి స్పందించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘లొంగిపోవాలని నేను నిన్ను కోరడం లేదు. దేవుడు నాకు నిన్ను బహుమతిగా ఇచ్చాడు. నేను ఆయనకు తిరిగి ఇచ్చేస్తున్నాను. అల్లా నీకు మంచి చేయాలని ప్రార్థిసున్నాను’ అంటూ సంభాషణ ముగించాడు. ఆ సంభాషణ తాలుకూ ఆడియో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ఎమ్‌ఫిల్ పూర్తి చేసిన ఎతిహాద్ లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించే సమయంలోనే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. అయితే ఈ విషయంపై స్పందించిన షోపియాన్ జిల్లా ఎస్ఎస్పీ మాట్లాడుతూ.. ఫోన్ సంభాషణలో ఉన్నది ఎతిహాద్ గొంతేనని ఇంకా నిర్దారణ కాలేదని తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులతో పాటు ముగ్గురు ఆర్మీ జవానులు కూడా మరణించిన విషయం తెలిసిందే. -
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా పంజ్గమ్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో భద్రతా దళాలు ప్రతిగా ఎదురు కాల్పులు జరిపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఘటనా స్థలంలో మూడు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి. కాగా జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని బ్రిగేడియర్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. హతమైనవారిలో ఇద్దరు హిజబుల్ ముజాహిద్దీన్, ఒకరు ఎల్ఈటీ ఉగ్రవాదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.