లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 48గంటల్లో 30మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరంతా మెదడు వాపు వ్యాధి కారణంగా చికిత్స పొందుతున్నవారే. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ ఆస్పత్రిలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు కలెక్టర్ రాజీవ్ రౌటెలా తెలిపారు. రెండు రోజుల కిందటే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఆస్పత్రికి తనిఖీకోసం వచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి వారంతా సమస్యల ఏకరువు పెట్టగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి సదరు ఆస్పత్రి రూ.66లక్షల బాకీ ఉంది. అది ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి. ఇందులో ఆస్పత్రి వర్గాలు, ప్రభుత్వ వర్గాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరో 45మంది చిన్నారులు వెంటిలేషన్‌పై ఉన్నారని తెలుస్తోంది. ముప్పైమంది చిన్నారులు చనిపోవడం, పైగా బీజేపీ పాలిత పెద్ద రాష్ట్రంలో ఈ దుర్ఘటన సంభవించడం రాజకీయంగా సంచలనం రేపే అవకాశం ఉంది.