ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు
- వైద్య కళాశాల ఆస్పత్రిలో 30 మంది చిన్నారుల మృతి
- ఆక్సిజన్ అందక 21 మంది మృత్యువాత
గోరఖ్‌పూర్ : ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో అక్కడ చికిత్స పొందుతున్న 30 మంది చిన్నారులు మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది. బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9–10 తేదీల్లో ఈ మరణాలు చోటుచేసుకు న్నాయి. ఆక్సిజన్ కొరత వల్ల 21 మంది చిన్నారులు మరణించారని కేంద్ర హోం శాఖ ప్రకటించగా.. ఆక్సిజన్ కొరత కారణం కాదని జిల్లా కలెక్టర్ పేర్కొనడం గమనార్హం.
‘గోరఖ్‌పూర్ ఎస్పీ సమాచారం మేరకు.. ద్రవరూప ఆక్సిజన్ కొరతతో 21 మంది మరణించారు. ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు’అని హోం శాఖ ప్రతినిధి శుక్రవారం రాత్రి తెలిపారు. చిన్నారుల వార్డులో 17 మంది, మెదడువాపు వార్డులో ఐదుగురు, జనరల్ వార్డులో 8 మంది మృతి చెందారని, కారణాలపై వైద్యుల్ని విచారిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ రౌతలా చెప్పారు. పక్కనున్న సంత్ కబీర్ నగర్ జిల్లా ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. చెల్లింపుల్లో జాప్యంతో ఆక్సిజన్ సరఫరా నిలిపివేశారా? అని ప్రశ్నించగా.. ఆక్సిజన్ సరఫరా కోసం సంబంధిత కంపెనీకి కొంత మొత్తం చెల్లించారని రౌతలా సమాధానమిచ్చారు.
రోజూ 7 నుంచి 10 మంది రోగుల మృతి: బీజేపీ ఎంపీ
ఈ ఘటన చాలా దురదృష్టకరమని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని యూపీ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆస్పత్రిని పరిశీలించిన అనంతరం బీజేపీ ఎంపీ కమలేశ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. కొన్ని మరణాలు ఆక్సిజన్ కొరత వల్ల సంభవించవచ్చని, అసలు కారణాలు తెలుసుకునేందుకు విచారణ అవసరమ న్నారు.
ఆస్పత్రిలో ప్రతి రోజూ 7 నుంచి 10 మంది రోగులు మరణిస్తున్నారని, చాలా సమస్యలున్నా యని పాశ్వాన్ తెలిపారు. కాగా ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూపీ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు డిమాండ్ చేశాయి. గతంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ నియోజక వర్గమైన గోరఖ్‌పూర్‌లో రాఘవ్‌దాస్ వైద్య కళాశాలే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడం గమనార్హం.