
35 ట్యాంకర్ల రక్తం!
35 ట్యాంకర్ల రక్తం.. దేశానికి ఇప్పుడా 35 ట్యాంకర్ల రక్తం కావాలి! ఎన్నో ప్రాణాలను నిలబెట్టేందుకు అంత రక్తం కావాలి.. ఎందుకంటే దేశం రక్త‘హీనత’తో బాధపడుతోంది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో కావల్సిన దాని కన్నా 35 ట్యాంకర్ల రక్తం తక్కువ ఉంది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అవసరానికన్నా ఎక్కువ ఉంది. మరికొన్ని చోట్ల మరీ తక్కువ ఉంది.
అసలు ఏమిటీ 35 ట్యాంకర్ల లెక్క? ఎక్కడ ఎక్కువ.. మరెక్కడ తక్కువ?
ఇటు బిహార్.. అటు చండీగఢ్..
రాష్ట్రాలవారీగా తీసుకుంటే.. బిహార్‌లో అవసరమైన రక్తంలో 16 శాతం మాత్రమే లభ్యమవుతోంది. అంటే.. అక్కడ లోటు 84%. ఛత్తీస్‌గఢ్(66%), అరుణాచల్‌ప్రదేశ్(64%)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే.. అవసరమైన దానికన్నా ఇక్కడ 45 శాతం లోటు ఉంది. వీటి పరిస్థితి ఇలా ఉంటే.. చండీగఢ్‌లో అవసరమైన దానికన్నా దాదాపు 9 రెట్లు అధికంగా(868%) యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో మూడు రెట్లు, దాద్రానగర్ హవేలీ, పుదుచ్చేరి, మిజోరాంలలో రెండు రెట్లు అధికంగా రక్తం అందుబాటులో ఉంది. దీని వల్ల మాత్రమే మొత్తంగా చూసినప్పుడు దేశంలో రక్తం లోటు 9 శాతంగా(2015-16) ఉంది.
దేశంలో ఏకీకృత రక్త సేకరణ వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా ప్రాంతాల వారీగా ఈ అసమానతలు నెలకొనడానికి కారణమవుతోందని బోంబే బ్లడ్ బ్యాంక్స్ ఫెడరేషన్ చైర్‌పర్సన్ జరీన్ బరూచా అన్నారు. ‘దీనికితోడు కొన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి బదులు ఒకేసారి భారీ కార్యక్రమాల ద్వారా రక్తం సేకరిస్తున్నారు. అసలే మన వద్ద రక్తదానం చేసేవారు తక్కువ. దీని వల్ల రెండు సమస్యలు వస్తున్నాయి. ఒకటి.. ఆ ప్రాంతాల్లో భవిష్యత్తులో వెంటనే రక్తం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. రెండోది.. ఒక చోట అత్యధిక సంఖ్యలో రక్త నిల్వలు ఉండిపోవడం వల్ల వృథా కూడా అవుతోంది’ అని చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రకారం 2011-2015 మధ్యలో ముంబైకి చెందిన 63 బ్లడ్ బ్యాంకుల్లో 1.3 లక్షల లీటర్ల రక్తం వృథా అయింది.
ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడం వల్ల పనికిరాకుండా పోయిందన్నమాట. శస్త్రచికిత్సల విషయంలో రోజురోజుకు పురోగతి సాధించడం.. మెడికల్ టూరిజం పెరుగుతుండటం వల్ల దేశంలో రక్తం అవసరం పెరుగుతోంది. ‘ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. దేశంలో తరచూ రక్తదానం చేసే సంప్రదాయాన్ని పెంపొందింపజేయాలి. లేదంటే.. ఆ 35 ట్యాంకర్ల రక్తం కోసం మనం భవిష్యత్తులో కూడా ఎదురుచూస్తునే ఉంటాం’ అని బరూచా అన్నారు.
ఆ లెక్క ఎలా..
2015-16 లెక్కల ప్రకారం దేశంలో 11 లక్షల యూనిట్ల రక్తం అవసరం ఉంది. యూనిట్‌ను 350 ఎంఎల్ కింద తీసుకుంటే.. ఒక ట్యాంకర్‌లో 11 వేల లీటర్లు (లీటరుకు 3 యూనిట్లు) పడతాయి. ఆ లెక్క ప్రకారం 11 లక్షల యూనిట్ల రక్తం 35 ట్యాంకర్లలో సరిపోతుంది. ఈ లెక్కన వారు లోటును 35 ట్యాంకర్ల రక్తంగా పేర్కొన్నారు.