క్యాన్సర్ కౌన్సెలింగ్
మా అమ్మగారికి 67 ఏళ్లు. ఆమెకు గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ వచ్చింది. మొదటి దశ (స్టేజ్–1)లో ఉందని డాక్టర్ తెలిపారు. మాకు తెలిసిన డాక్టర్లను సంప్రదిస్తే రెండు మార్గాలు తెలిశాయి. మొదటిది... శస్త్రచికిత్స. రెండోది రేడియోథెరపీ. మేం కాస్త అయోమయంలో ఉన్నాం. శస్త్రచికిత్స అన్నా, రేడియో«థెరపీ అన్నా భయంగా కూడా ఉంది. దయచేసి మాకు తగిన మార్గాన్ని సూచించగలరు. – కె. అశోక్, విశాఖపట్నం
మొదటì దశ సర్విక్స్ క్యాన్సర్‌ను సర్జరీ లేదా రేడియోథెరపీ ద్వారా నయం చేయగలం. అయితే చాలా సందర్భాల్లో దీనికి మొదట శస్త్రచికిత్స చేసి, తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మీరు రేడియో థెరపీయే కోరుకుంటే అది కూడా సాధ్యమే. చాలా సందర్భాలలో సర్జరీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇటీవల రేడియేషన్ టెక్నాలజీలలో వచ్చిన పురోగతి వల్ల రేడియోథెరపీ వల్ల ఇతర దుష్ప్రభావాలు కూడా దాదాపు ఉండవు. కాబట్టి మీరు నిర్భయంగా రేడియోథెరపీ చేయించవచ్చు.
విసర్జన మార్గం వేరేచోట ఏర్పాటు చేస్తా మంటున్నారు!
నా వయసు 42 ఏళ్లు. నేను మలవిసర్జన చేస్తుంటే రక్తం పడుతోంది. దాంతో డాక్టర్‌కు చూపిస్తే మలద్వారం వద్ద క్యాన్సర్ అని చెప్పారు. శస్త్రచికిత్స చేసి మలద్వారాన్ని మూసేసి, కడుపుదగ్గర మలవిసర్జనకు అనువుగా మరో ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఇది నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అలాంటి పరిస్థితే వస్తే నాకు మరణమే శరణం అన్నంత నిస్పృహగా ఉంది. దయచేసి నాకు సలహా ఇవ్వండి. – ఎల్. లక్ష్మణ్, జగిత్యాల
మీరు అంత నిస్పృహకు లోనవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ సమస్య పరిష్కారం కోసం కీమోథెరపీ లేదా రేడియోథెరపీ తీసుకోవచ్చు. ఒకసారి మీ క్యాన్సర్ గడ్డ కుంచించుకుపోయాక ‘యాంటీరియర్ రెసెక్షన్’, ‘అల్ట్రా లో యాంటీరియర్ రిసెక్షన్’ వంటి శస్త్రచికిత్సలు చేస్తారు. దీనివల్ల మీరు గతంలో లాగే మామూలుగా మలవిసర్జన చేయవచ్చు. అంతేగానీ కడుపు దగ్గర మలద్వారం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ నిరాశ, నిస్పృహలను వదలి తగిన చికిత్స చేయించుకోండి. పైగా మీ సమస్య పూర్తిగా నయమయ్యేందుకు అవకాశాలు కూడా ఎక్కువే. కాబట్టి ఆందోళన వదిలేయండి.
మల విసర్జనకు వెళ్లినప్పుడు రక్తం పడుతోంది
నా వయసు 58 ఏళ్లు. మలవిసర్జనకు వెళ్లినప్పుడు నాకు మలంలో రక్తం పడుతోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. – కె. రత్తయ్య, ఒంగోలు
మీరు ముందుగా డాక్టర్‌ను సంప్రదించి కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మీరు చెబుతున్న లక్షణాలు మూడు ప్రధాన సమస్యల వల్ల రావచ్చు. మొదటిది ఫిషర్ ఇన్ యానల్ కెనాల్ అనే సమస్య. ఈ సమస్యలో రక్తం పడటంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. రెండోది హెమరాయిడ్స్ అనే సమస్య. దీన్నే పైల్స్ అని కూడా అంటారు. తెలుగులో ఈ సమస్యను మొలలు అని చెబుతుంటారు. ఈ సమస్యలో కూడా రక్తస్రావం కనిపిస్తుంది. ఇక మూడోది క్యాన్సర్. మీకు ఈ మూడింటిలో ఏ సమస్య ఉందో నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఉదాహరణకు పెద్దపేగును, మలద్వారం వంటి భాగాలను పరీక్షించేందుకు చేసే కొలనోస్కోపీ వంటివి. మీకు ఒకవేళ మొదటì లేదా రెండో సమస్య ఉంటే వాటిని సాధారణ శస్త్రచికిత్సల ద్వారా పరిష్కరించవచ్చు. కానీ ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లు తేలితే... అక్కడి గడ్డ నుంచి కొంత ముక్క సేకరించి, వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత మీకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో నిర్ణయిస్తారు. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న చికిత్సలను అనుసరించి పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
కిడ్నీ క్యాన్సర్ తిరగబెడుతుందా?
నేను దాదాపు పదమూడేళ్ల కిందట కిడ్నీలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాను. మళ్లీ ఇటీవలే నడుమునొప్పి వస్తుంటే వైద్యపరీక్షలు చేయించుకున్నాను. రిపోర్ట్‌లను పరిశీలించాక డాక్టర్ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. అది కిడ్నీ నుంచి వెన్నుకు పాకిందంటున్నారు. ఇంతకాలం తర్వాత కూడా తగ్గిన క్యాన్సర్ మళ్లీ తిరగబెడుతుందా? అది నయమయ్యే అవకాశం ఉందా? – ఆర్. దుర్గారావు, విజయవాడ
చికిత్స తీసుకున్నప్పటికీ కొంతకాలం తర్వాత కిడ్నీ క్యాన్సర్ లేదా మరికొన్ని క్యాన్సర్లు తిరగబెట్టే అవకాశం ఉంది. అది ఐదేళ్లు, పదేళ్లు, పదిహేను లేదా ఇరవై ఏళ్ల తర్వాతైనా కావచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్‌పై అదుపు సాధించేందుకు అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ విషయానికి వస్తే మీరు వెన్నుకు రేడియేషన్ చికిత్స తీసుకోవచ్చు. ఎక్స్–నైఫ్ ఎస్‌ఆర్‌ఎస్‌తో క్యాన్సర్‌ను అదుపు చేయవచ్చు. ఈ చికిత్స ప్రక్రియ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఉండవు. నొప్పిని కూడా తక్షణం నివారించవచ్చు.
డాక్టర్ పి. విజయానంద్ రెడ్డి
డైరెక్టర్, అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్,
జూబ్లీహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment