గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ప్రతిష్టాత్మకంగా ఈ దఫా జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికలు ఒకరకంగా విషమ పరీక్ష పెడుతున్నాయనడంలో సందేహం లేదు. రెండు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో 5 అంశాలు ఓటర్లును ప్రభావితం చేసే అవకాశముందని తెలుస్తోంది.
పటేల్ కోటా
ఈ దఫా శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రభావితం చేస్తున్న ఏకైక అంశం ఇదే. పటేల్ వర్గానికి రిజర్వేషన్ కోటా కల్పించాలని హార్ధిక్ పటేల్ చేసిన ఉద్యమం తరువాత దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల పాలనలో బీజేపీకి అతి పెద్ద సవాల్ విసిరిన అంశం కూడా ఇదే. ఇదిలా ఉండగా.. పటేల్ వర్గాన్ని ఓబీసీలో చేర్చే విషయంపై గత నెల్లో ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌పై హార్ధిక్ పటేల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లోని 182 స్థానాల్లో దాదాపు 60 నియోజకవర్గాల్లో పటేల్ వర్గం జయాపజాలను నిర్ణయించే స్థాయిలో ఉంది.
జీఎస్టీ
భారతీయ జనతాపార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న చిన్న, సన్నకారు వ్యాపారులంతా జీఎస్టీతో కుదేలయ్యారు. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమ వ్యాపారులు 5శాతం జీఎస్టీని తగ్గించాలని ప్రధాని మోదీని కోరుతున్నారు. పారిశ్రామిక అడ్డా అయిన సూరత్‌లోనూ జీఎస్టీ పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది మంది వ్యాపారులు రోడ్లమీదకు వచ్చి జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం మాత్రం జీఎస్టీ వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్‌లో మాత్రం మంచి ఫలితాలు వస్తాయని చెబుతోంది.
నర్మదా డ్యామ్
ప్రధాని నరేంద్ర మోదీ గత సెప్టెంబర్ నెల్లో దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన నర్మాదా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల 2 లక్షల 46 వేల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు గుజరాత్ స్వరూన్నే మార్చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. దాదాపు 500 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువ, ఆరు బ్రాంచ్ కెనాల్స్ పనులను బీజేపీ ఇప్పటికీ పూర్తి చేయలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
నిరుద్యోగం
గుజరాత్ యువత ప్రస్తుతం ఎన్నడూలేనంత నిరాశలో ఉంది. ఉద్యమాలు, పోరాటాలతో పలు సంస్థలు మూతపడ్డాయి. దీంతో వందలాది మంది యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో.. ఈ విషయాన్నే అధికంగా ప్రస్తావిస్తున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులు
టీచర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణ కోసం గుజరాత్ ప్రభుత్వం కాంట్రాక్టు పద్దతిలో యువతను ఉద్యోగాల్లోకి తీసుకుంది. వీరికి ఖచ్చితమైన వేతనంతో రెండేళ్ల కాంట్రాక్టు కింద వీరికి ఉద్యోగాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులు.. తమ వేతనాలు పెంచడంతో పాటు.. రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment