
జార్ఖండ్‌లో మావోల దాడిలో ఏడుగురు మృతి!
జార్ఖండ్‌లో బుధవారం మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు ఐదుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు న్యూస్ చానల్స్ ద్వారా తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు నక్సల్స్ ఎన్‌కౌంటర్
రాంచి: జార్ఖండ్‌లో బుధవారం మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు ఐదుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు న్యూస్ చానల్స్ ద్వారా తెలుస్తోంది. అయితే, పీటీఐ వార్తాసంస్థ మాత్రం ఇద్దరు పోలీసులు చనిపోగా, ఏడుగురు గాయపడినట్లు పేర్కొంది. సాయంత్రం 5 గంటల సమయంలో పోలీసులు టాటా 407 వాహనంలో పాలము జిల్లాలోని కాలాఫరి వైపు వెళ్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
గత రెండు రోజులుగా పాలము జిల్లాలోని పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం కూడా కాల్పులు భారీగా ఎదురుకాల్పులు జరగడంతో అక్కడికి తరలివెళ్తున్న పోలీసులపై మావోలు ఈ దాడికి పాల్పడ్డారు. మరో ఘటనలో, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ముగ్గురు 2013లో బస్తర్‌లో కాంగ్రెస్ పరివర్తన్ ర్యాలీపై దాడి చేసినవారిలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. నాటి దాడిలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ సహా 31 మంది కాంగ్రెస్ నేతలు చనిపోయారు.